Begin typing your search above and press return to search.

బాబుగారు భుజాలు తడుముకుంటున్నారు!

By:  Tupaki Desk   |   15 Feb 2018 8:16 AM GMT
బాబుగారు భుజాలు తడుముకుంటున్నారు!
X
గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న వాడి చందంగా ఉంది... ఏపీసీఎం చంద్రబాబునాయుడు వ్యవహార సరళి! భాజపా తో మిత్రపక్షంగా ఉంటూ - వారి ముందు సాగిలపడుతూ కూడా.. రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోతున్నాం.. అనే ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబునాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు కూడా అర్థమవుతున్నట్లు లేదు. వేర్వేరు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని... భాజపాను నేరుగా నిందించడానికి ఇప్పటికీ ధైర్యం చేయలేకపోతున్న చంద్రబాబునాయుడు.. అదే సమయంలో వీళ్లిద్దరి గొడవతో ఏమాత్రం సంబంధంలేని రాష్ట్రంలోని విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ మీద మాత్రం బురద చల్లడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. వైఎస్సార్ సీపీతో మైత్రికి విలువ ఇస్తున్నదని - వారిద్దరి మధ్య బంధం ముదురుతోందని ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన మీద ఉన్న కేసుల గురించి చంద్రబాబు పదేపదే భుజాలు తడుముకుంటూ ఉండడం మరో ఎత్తు.

శుక్రవారం నాడు అమరావతిలో పార్టీ నేతలతో సమావేశం పెట్టుకున్న చంద్రబాబు... భాజపాతో బంధం ఏ క్షణాన్నయినా తెగిపోయే విధంగా ఉన్నదనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రసంగంలో చాలా భాగాన్ని ఆయన ‘నేనెవ్వరికీ భయపడే రకం కాదు. నేను కేసులకు భయపడి కేంద్రంతో మెతగ్గా ఉంటున్నానని ఆరోపిస్తున్నారు.. అదంతా అబద్ధం’. అలాంటి మాటలతో తనమీద కేసుల గురించి చెప్పుకోవడానికే సమయం కేటాయించారంటే.. ఆయన ఎంతగా భుజాలు తడుముకుంటున్నారో అర్థమవుతున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

‘నేను కేసులకు భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు’ అంటూ ఆగ్రహిస్తున్న ముఖ్యమంత్రే.. ‘కేసులంటే మనకెందుకు భయం’ అంటూ కేసులు ఉన్నమాటని మాత్రం అన్యాపదేశంగా అంగీకరిస్తున్నారు. అదే సమయంలో రాజధానిలో లక్షకోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.. అవేమీ లేదని తేలిపోయింది అంటూ సమర్థించుకుంటున్నారు. మన మీద ఉన్న కేసులన్నిటికీ.. ఇప్పటికే క్లీన్ చిట్ వచ్చేసింది... అంటూ దశాబ్దాల కింద గడచిపోయిన వ్యవహారాల్ని నెమరు వేసుకుని తన ఘనతను చాటుకుంటున్నారు. మధ్యలో అప్రస్తుత ప్రసంగం లాగా.. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి.. అక్కడి సీఎం లందరూ కేసుల విషయంలో కేంద్రానికి భయపడుతున్నారా.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

అయినా చంద్రబాబు ఇంతగా భుజాలు తడుముకుంటున్నారంటేనే.. కేసుల ఆందోళన ఆయన మీద ఎంతగా ప్రభావం చూపిస్తోందో అర్థమవుతోంది. ఓటుకు నోటు కేసులో ఆయన బాగా కూరుకుపోయి ఉన్నారని అందుకే ఇలా మధ్యేమార్గంగా మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ‘నా మీదేం కేసులున్నాయ్.. నాకేంది భయ్యం’ అని ఆయన ఎంతగా రెచ్చిపోతూ మాట్లాడుతున్నా.. ఆ మాటలు ఆయనలోని భయానికి ప్రతీకలుగానే ఉన్నాయని జనం అనుకుంటున్నారు.