Begin typing your search above and press return to search.

ప్రచారానికి బాబు వ‌స్తారా? రారా..!?

By:  Tupaki Desk   |   11 Oct 2018 5:47 AM GMT
ప్రచారానికి బాబు వ‌స్తారా? రారా..!?
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ - నల్గొండ - వనపర్తిలలో భారీ బహిరంగ సభలతో ప్రచారంలో మునిగి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి రెండు బహిరంగ సభలు నిర్వహించింది. కొత్తగా పుట్టిన తెలంగాణ జన సమితి కూడా బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో మంచి ఊపు మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తన ప్రభాల్యాన్ని కోల్పోయింది. మహాకూటమిలో భాగస్వామ్య పక్షంగా చేరి పాత ప్రభావాన్ని తిరిగి తెచ్చుకోవాలి తంటాలు పడుతోంది. అయితే ఇంకా ప్రచారాన్ని మాత్రం ప్రారంభించ లేదు. ఆటలో అరిటిపండుగా మిగులుతుందనుకుంటున్న భారతీయ జనతా పార్టీ సహితం బహిరంగ సభతో ప్రచారాన్ని ప్రారంభించింది. పొత్తు ఖరారై సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ తన ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.

మహాకూటమి ఏర్పాటు - సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై కూటమి పక్షాల నేతలు పలు దఫాలుగా సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశాలు గురించి కాని, చర్చించిన అంశాల గురించి కాని చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం నాయకులతో మాట్లడిన దాఖలాలు లేవు. సీట్ల సర్దుబాటు - అభ్యర్దుల ఎంపిక - ప్రచార కార్యక్రమాలు అన్నీ తెలంగాణ తెలుగుదేశం నాయకులే చూసుకోవాలని ఈ ఎన్నికలలో తాను ప్రత్యక్షంగా పాల్గొననని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. అలాగే బహిరంగ సభలలో తాను కాని - ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన మంత్రులు - తెలుగుదేశం నాయకులు కాని పాల్గొనరు అని, అన్నీ తెలంగాణ నాయకులే చూసుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణలో ఎలా ప్రచారం చేస్తారని - ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలలో తామూ ప్రచారం చేస్తామా అని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించినట్లు చెబుతున్నారు. ఈ వాదనతో ఏకీభవించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గునే అవకాశం లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. మహాకూటమి ఏర్పడిన తర్వాత కాంగ్రెస అగ్ర నాయకులు పెద్ద ఎత్తున ప్రచారానికి వస్తారని - అలాగే ఇతర రాష్ట్రాలలో తమకు సన్నిహితంగా ఉండే నాయకులను ప్రచారానికి తీసుకు వస్తానని చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం నాయకులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.