Begin typing your search above and press return to search.

అనర్హతకు అర్ధం తెలుసుకోండి బాబూ..!?

By:  Tupaki Desk   |   26 Oct 2018 1:30 AM GMT
అనర్హతకు అర్ధం తెలుసుకోండి బాబూ..!?
X
శాసనసభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు. వారిని శాసనసభకు ఎవరు పంపిస్తారు. వారిపై వ్యతిరేకత వస్తే వారిని తర్వాత ఎన్నికల్లో ఎవరు ఇంటికి పంపుతారు. వీటన్నింటికి సమాధానం ప్రజలే అని భారతదేశంలో ఏ రాష్ట్రం వారైనా చెబుతారు. అలా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓ పార్టీ నుంచి ఎన్నికై ఆనక అధికార పార్టీలో మారితే వారిని ఏం చేయాలి.!? తెలుగు రాష్ట్రాల్లో అయితే వారికి మంత్రి పదవులు ఇస్తారు. అంతేనా.... వారి అనుచరగణానికి పదవులు దక్కుతాయి. అంతే కాదు... ఆర్ధిక వనరులు లభిస్తాయి. అయితే పొరుగున ఉన్న తమిళనాడు మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయిస్తే వారినిఅనర్హులుగా ప్రకటిస్తారు. ఈ చారిత్రక తీర్పు గురువారం నాడు తమిళనాడు హైకోర్టు వెలువరించి కోర్టుల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లకుండా చూసింది. తమిళనాడులో పార్టీ ఫిరాయించిన కొందరు ఎమ్మెల్యేలు పదవులకు అనర్హులంటూ ఆ కోర్టు ప్రకటించడంతో అక్కడ అధికారంలో ఉన్న పళనిస్వామి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పళనిస్వామికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండగా నిలబడింది. దీంతో ఎమ్మెల్యేలు అనర్హులయ్యారు. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీన్ రివర్స్. ఇక్కడ అనర్హులు అర్హులయ్యారు. కొండకచో మంత్రులూ అయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో 2014 సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు చోట్ల తెలంగాణ రాష్ట్ర సమితి - తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.కొన్నాళ్లు అంతా సవ్యంగానే నడిచింది. ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి తెలంగాణలో తెలుగుదేశం నుంచి గెలిచిన వారు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు అధికార తెలుగుదేశంలో చేరారు. అంతేనా అక్కడా... ఇక్కడా ఏకంగా మంత్రులయ్యారు. తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా చేయాలంటూ ప్రకటనలు చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇదేమిటీ వారిని అనర్హులుగా ప్రకటించండంటూ ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెత్తీనోరు కొట్టుకున్నా ఆ పని మాత్రం జరగలేదు. నాలుగు సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడ్ని తమిళనాడులో పళనిస్వామిని కాపాడినట్లే బీజేపీ కాపాడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజకీయాల్లో నైతికత గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు తమిళ హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పార్టీ ఫిరాయించి తన దగ్గరకు వచ్చిన వారిని ఉంచుకుంటారో.... పంపుకుంటారో ఆయనకే తెలియాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.