Begin typing your search above and press return to search.

కాపులు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు కోరుకోవ‌టం లేదన్న బాబు

By:  Tupaki Desk   |   2 Dec 2017 8:24 AM GMT
కాపులు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు కోరుకోవ‌టం లేదన్న బాబు
X
చిత్ర‌విచిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చాలా దిట్ట‌. త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యే ఆయ‌న.. కొన్ని సంద‌ర్భాల్లో చేసే వ్యాఖ్య‌లు ఆయ‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుంటాయి. తాజాగా మరోసారి అలాంటి ప‌నినే చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు వేదిక‌గా ఏపీ అసెంబ్లీ నిలిచింది.
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తానంటూ భారీ హామీని ఇచ్చేశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. అధికారంలోకి వ‌చ్చిన నాలుగేళ్ల త‌ర్వాత కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించి.. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఇక్క‌డే త‌న‌దైన శైలిలో ట్విస్ట్ పెట్టారు చంద్ర‌బాబు.

కాపుల‌కు ఇస్తున్న రిజ‌ర్వేష‌న్లు విద్య‌.. ఉద్యోగ అవ‌కాశాల‌కు మాత్ర‌మే కానీ రాజ‌కీయాల‌కు కాదనేశారు. ఈ సంద‌ర్భంగా బాబు నోటి నుంచి వ‌చ్చిన మాట వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. కాపుల‌కు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు కావాలంటూ త‌న‌ను కాపులు అడ‌గ‌లేద‌న్నారు.

ఆ మాట‌కు వ‌స్తే త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలంటూ కాపులు త‌న‌ను అడ‌గ‌లేద‌ని.. కాకుంటే ఎన్నిక‌ల ముందు తాను చేప‌ట్టిన పాద‌యాత్ర సంద‌ర్భంగా కాపు సోద‌రుల క‌ష్టాల్ని చూసి తానే రిజ‌ర్వేష‌న్ల హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు. కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించామ‌ని.. కాపుల సంక్షేమం కోసం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేద‌న్నారు.ఏపీ అసెంబ్లీలో కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తూ ప్ర‌వేశ పెట్టిన బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు.

బ్రిటీష్ కాలంలో కాపుల‌కు రిజ‌ర్వేషన్లు ఉండేవ‌ని.. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత తీసేశార‌న్నారు. కార‌ణం చెప్ప‌కుండా స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత రిజ‌ర్వేష‌న్లు తీసేశార‌ని.. 2016లొ కాపుల రిజ‌ర్వేష‌న్ల మీద జ‌స్టిస్ మంజునాథ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలు అన్నింటిలోనూ ప‌ర్య‌టించిన క‌మిష‌న్ కాపుల స్థితిగ‌తుల మీద అధ్య‌య‌నంచేశార‌న్నారు. కాపులు రాజ‌కీయాల్లో రిజ‌ర్వేష‌న్లు కోరుకోవ‌టం లేద‌ని అందుకే విద్య‌.. ఆర్థిక విష‌యాల్లో రిజ‌ర్వేష‌న్లు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌కుండా ఉండ‌ట‌మే చంద్ర‌బాబు నిర్ణ‌యం అయిన‌ప్పుడు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లోనే ఇదే విష‌యాన్ని బాబు ఎందుక‌ని సూటిగా చెప్ప‌న‌ట్లు?