Begin typing your search above and press return to search.

కేసీఆర్ చేత తిట్టించుకునే మాట చెప్పిన బాబు

By:  Tupaki Desk   |   23 Dec 2018 5:34 AM GMT
కేసీఆర్ చేత తిట్టించుకునే మాట చెప్పిన బాబు
X
కొన్ని కాంబినేష‌న్లు భ‌లేగా ఉంటాయి. అలాంటి కాంబినేష‌నే రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లు. ఒక‌ప్పుడు బాబు శిష్యుడిగా ఉన్న కేసీఆర్‌.. ఇప్పుడు ఆయ‌న్ను ఎంత మాట ప‌డితే అంత మాట అనేసే ప‌రిస్థితి. బాబును ఎవ‌రైనా తిట్ట‌గ‌ల‌రు. ఆయ‌న జాత‌కం అలాంటిది. అయితే.. ఎవ‌రెంత‌గా తిట్టినా.. కేసీఆర్ తిట్టే తిట్ల ముందు బ‌లాదూరే. బాబు ప‌నుల్ని.. ఆయ‌న మాట‌ల్ని ఎట‌కారం చేయ‌టంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా.

దీనికి త‌గ్గ‌ట్లే.. కేసీఆర్‌ కు ఛాన్స్ ఇచ్చేలా బాబు మాట‌లు ఉంటాయ‌ని చెప్పాలి. బాబు మాట్లాడిన‌ప్పుడు మామూలుగా అనిపించే కొన్ని మాట‌లు.. కేసీఆర్ రియాక్ట్ అయ్యాక చూస్తే మాత్రం.. బాబు అన‌వ‌స‌రంగా కెలుక్కున్నారే అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బాబు చేసిన ఓవ‌రాక్ష‌న్ కు రిట‌ర్న్ గిఫ్ట్ అంటూ కేసీఆర్ వేసిన పంచ్ ఎంత‌లా అదిరిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఎన్నిక‌లకు ముందు టీఆర్ ఎస్ తో తాను పొత్తు పెట్టుకోవాల‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు.. ఏ సంద‌ర్భంలో చెప్పిందో చెప్పి అంద‌రి చేత ఛీ కొట్టించుకున్న బాబు తాజాగా కేసీఆర్ కు మ‌రో ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లుగా వ్యాఖ్యానించారు. మోడీకి వ్య‌తిరేకంగా తాను క‌ట్టిన గ్రూపులోకి కేసీఆర్ రావొచ్చంటూ ఆఫ‌రిచ్చారు. ఇలాంటి మాట‌లకు కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఓప‌క్క త‌న‌ను ఛీ కొట్టే కేసీఆర్‌ ను అదే ప‌నిగా క‌లిసి ప‌ని చేయాలంటూ బాబు చేసే వ్యాఖ్య‌ల వెనుక అస‌లు అర్థం వేరుగా చెబుతున్నారు. కేసీఆర్ త‌న‌ను రెచ్చ‌గొట్టేలా.. చుల‌క‌న చేసేలా వ్యాఖ్య‌లు చేసినా.. వాటిని ప‌ట్టించుకోకుండా కేసీఆర్ తో క‌లిసి జ‌ర్నీ చేయాల‌న్న ఆకాంక్ష ద్వారా.. తెలుగు సెంటిమెంట్‌ను తెర మీద‌కు తీసుకురావాల‌న్న వ్యూహంగా చెబుతున్నారు. అయితే.. బాబు లాంటోడి కాలం చెల్లిన ఐడియాలు కేసీఆర్ ముందు చెల్ల‌వ‌ని చెబుతారు. కేసీఆర్ చేత పొట్టు పొట్టుగా తిట్టించుకునేలా బాబు తాజా మాట‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇండియా టుడే నిర్వ‌హించిన స‌ద‌స్సులో పాల్గొన్న బాబు.. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ.. బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలోకి కేసీఆర్ కు స్వాగ‌తం చెబుతున్నాన‌ని.. ఆయ‌న నిర‌భ్యంత‌రం రావొచ్చ‌న్నారు.

త‌న‌దైన ముద్ర‌ను చూపించేందుకు కేసీఆర్ త‌హ‌త‌హ‌లాడుతూ.. అందులో భాగంగా ప్ర‌యాణం పెట్టుకున్న వేళ బాబు చేసిన వ్యాఖ్య‌లకు కేసీఆర్ చేతిలో భారీ కౌంట‌ర్ త‌ప్ప‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.