Begin typing your search above and press return to search.

చివ‌రి కేబినెట్ మీట్!..ఆ ఫీలే లేదబ్బా!

By:  Tupaki Desk   |   5 March 2019 10:40 AM GMT
చివ‌రి కేబినెట్ మీట్!..ఆ ఫీలే లేదబ్బా!
X
లాస్ట్ క్లాస్‌ - లాస్ట్ ఎగ్జామ్‌ - చిట్ట చివ‌రి అసెంబ్లీ స‌మావేశాలు - చివ‌రి కేబినెట్ భేటీ... ఇలా చివ‌రిగా జ‌రిగే స‌మావేశాలు - స‌న్నివేశాల్లో మంచి ఫీల్ క‌లుగుతుంది. అప్ప‌టిదాకా క‌లిసిమెల‌సి ఉన్న క్లాస్ మేట్స్ విడిపోతున్న‌ప్పుడు క‌నిపించే భావోద్వేగాలు మ‌న‌కు తెలియ‌నివేమీ కాదు. అలాగే... ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి ఇక ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కాక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో జ‌రిగే చిట్ట చివ‌రి కేబినెట్ భేటీల్లోనూ ఈ త‌ర‌హా భావోద్వేగాలు క‌నిపిస్తాయి. ఐదేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు త‌మ ప్ర‌భుత్వం ఏమేం చేసింద‌న్న విష‌యాల‌ను చెబుతూ సుదీర్ఘంగా చివ‌రి కేబినెట్ భేటీ జ‌రుగుతుంది. మంత్రులంతా త‌మ టీమ్ లీడ‌ర్‌ను ఆకాశానికెత్తేయ‌డం, త‌న మిత్రులంతా మంచిగా ప‌నిచేశార‌ని టీమ్ లీడ‌ర్‌ గా ఉన్న సీఎం ప్ర‌శంస‌లు కురిపించ‌డం మ‌న‌కు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా సంద‌ర్భం వ‌చ్చింది.

అయితే స‌మావేశం చివ‌ర‌ద‌న్న విష‌యం వ‌ర‌కు ఓకే గానీ... అందులో క‌నిపించాల్సిన భావోద్వేగాలు - ఆకాశానికెత్తేయ‌డాలు - ప్ర‌శంస‌ల జ‌ల్లులు మ‌చ్చుకు కూడా క‌నిపించ‌లేదు. ఒక‌టే టెన్ష‌న్‌. కేబినెట్ భేటీ మొద‌ల‌వ‌డానికి ముందు నుంచే క‌నిపించిన టెన్ష‌న్‌... కేబినెట్ భేటీ ముగిసిన త‌ర్వాత కూడా చాలా స్ప‌ష్టంగానే క‌నిపించింది. ముందూ చివ‌రా టెన్ష‌నే క‌నిపించి ఉంటే... ఇక కేబినెట్ భేటీ సాగినంత సేపు టెన్ష‌న్ కాక మ‌రేం ఉంటుంది. టెన్ష‌నే ఉండి ఉంటుంది. అయినా టెన్ష‌న్ ప‌డ‌కుండా చివ‌రి కేబినెట్ భేటీని ఆనందోత్సాహాల మ‌ధ్య జ‌రపుకునే వెసులుబాటు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి ఎక్క‌డిది? నిజ‌మే... డేటా చోరీ వివాదంలో చాలా హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన చంద్ర‌బాబు... అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు.

ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని భ‌ద్రంగా కాపాడాల్సిన గురుత‌ర బాధ్య‌త‌ను మ‌రిచిన చంద్ర‌బాబు... ఆ డేటాను త‌నకు కొమ్ము కాసే ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ సంస్థ‌కు ఇచ్చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను పెను ముప్పులో ప‌డేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ పోలీసులు ఈ కేసు వ్య‌వ‌హారంలో అత్యుత్సాహానికి పోయిన ఏపీ పోలీసుల‌పై కేసులు న‌మోదు చేయ‌డంతో పాటుగా ఈ కేసులో మొత్తం డేటాను ప్రైవేట్ సంస్థ‌కు అప్ప‌గించార‌న్న కార‌ణం చూపి ఏకంగా చంద్ర‌బాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు తేనెతుట్టెలా లేచిన ఈ వివాదం ఎక్క‌డ త‌మ కొంప ముంచుతుందోన‌న్న భ‌యం చంద్ర‌బాబును వెంటాడుతోంది. ఈ నేప‌థ్యంలో త‌న ఐదేళ్ల పాల‌న‌కు సంబంధించి నేటి ఉద‌యం అమ‌రావ‌తిలో నిర్వ‌హించిన చిట్ట‌చివ‌రి కేబినెట్ భేటీలో చంద్ర‌బాబు టెన్ష‌న్ ప‌డుతూనే గ‌డిపాల్సి వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది.