Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ సీట్ల విషయంలో టీడీపీలో గందరగోళమే!

By:  Tupaki Desk   |   16 March 2019 4:17 AM GMT
ఆ ఎంపీ సీట్ల విషయంలో టీడీపీలో గందరగోళమే!
X
ఒకటి కాదు రెండు కాదు.. కొన్ని ఎంపీ సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీలో గందరగోళం సాగుతూ ఉంది. ఎంపీ అభ్యర్థిత్వాల విషయంలో చంద్రబాబు నాయుడు కసరత్తు కొనసాగుతూ ఉంది. కొన్ని నియోజకవర్గాల విషయంలో నేతలు ఇలా తెలుగుదేశం పార్టీలోకి చేరడం - ఆ వెంటనే టీడీపీ టికెట్ ఖరారు కావడం జరుగుతూ ఉంది. తిరుపతి ఎంపీ సీటు విషయంలో పనబాక లక్ష్మికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం అలానే ఉంది.

గత ఐదేళ్లుగా పనబాక లక్ష్మి రాజకీయంగా అచేతనంగానే ఉండిపోయారు. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశం లేకపోవడంతో పనబాకకు రాజకీయ భవితవ్యం కూడా లేదని అనుకున్నారు. అయితే ఎస్సీ రిజర్వడ్ సీటు అయిన తిరుపతి లో అభ్యర్థి ఎవ్వరూ దొరకకపోవడంతో చంద్రబాబు చివరకు పనబాక లక్ష్మిని చేర్చుకుని టికెట్ ఖరారు చేసేశారు.

అలా కార్యకర్తలకు ఒక రకంగా షాకే ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక మరో ఎస్సీ రిజర్వడ్ సీటు అమలాపురం విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే ఉంది. అక్కడ ఇప్పటి వరకూ అభ్యర్థి ఫైనల్ కాలేదు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ను ఖరారు చేయనున్నరట చంద్రబాబు.

ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన తర్వాత ఇలా ఎన్నికల ముందు - నామినేషన్ల సమయంలో ఎక్కడెక్కడి నుంచినో - తెరమరుగు అయిన నేతలను చేర్చుకుని చంద్రబాబు టికెట్ ఖరారు చేస్తూ ఉన్నారు. అంతిమంగా ఈ అనూహ్యమైన అభ్యర్థులకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక ఒంగోలులో ‘వద్దు.. వద్దు..’ అన్నా శిద్ధా రాఘవరావుకే టికెట్ ను ఖరారు చేశారరని తెలుస్తోంది. నెల్లూరు నుంచి కూడా అభ్యర్థిత్వం విషయంలో బీద మస్తాన్ రావును ఒప్పించారు. కావలి వదలడానికి ససేమేరా అనేసిన ఆయనను చివరకు నెల్లూరు ఎంపీగా రంగంలోకి దింపుతున్నారు.

ఇక మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. తను చెప్పిన మార్పులు చేయకపోతే అనంతపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సీట్లకు తను చెప్పిన వారిని పోటీ చేయించనట్టు అయితే.. తాము పోటీ చేసి కూడా వృథా అని ఆయన అంటున్నారు.

నరసాపురం - బాపట్ల ఎంపీ సీట్ల విషయంలో కూడా ఇంకా చర్చలు సాగుతూ ఉండటం - ఏకాభిప్రాయాలు - అభ్యర్థిత్వాలు ఖరారు అవుతున్న దాఖలాలు కనిపించడం విశేషం.