Begin typing your search above and press return to search.

వార్ వ‌న్‌ సైడ్ కావాలంటున్న బాబు

By:  Tupaki Desk   |   11 July 2017 5:31 AM GMT
వార్ వ‌న్‌ సైడ్ కావాలంటున్న బాబు
X
ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ పాల‌న‌కు రెఫ‌రెండం అనే ప్ర‌చారం జోరుగా సాగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ల‌కు బాబు బాధ్య‌త‌లు అప్ప‌గించి గెలిచి తీరాల్సిందేన‌ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో క‌ర్నూలుకు చెందిన నాయ‌కుల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ పెద్ద పీట వేస్తున్నారు. తాజాగా నంద్యాల ఉప పోరు గురించి చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మాజీమంత్రి - తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎన్ ఎండీ ఫరూక్ నేతృత్వలో పెద్దసంఖ్యలో తరలివచ్చిన టీడీపీ నంద్యాల నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులను అమ‌రావ‌తికి పిలిపించిన చంద్ర‌బాబు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. నంద్యాల నియోజకవర్గంలో ఎన్నిక ఏకపక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాబు పిలుపునిచ్చారు.

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు నంద్యాల ఉపఎన్నిక ఒక పరీక్ష అని, ఈ పరీక్షలో ఫస్టు మార్కులు రావాలని చంద్ర‌బాబు ఆదేశించారు. మాజీ మంత్రి ఎన్‌ ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకుడు అని, క్రమశిక్షణ కలిగిన వారిని పార్టీ ఎప్పటికీ గౌరవిస్తుందని, వారి సేవలను గుర్తిస్తుందని చెప్పారు. తాను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు - ప్రతిపక్షనేతగా 10 ఏళ్లు - ఇప్పుడు కొత్త రాష్ట్రానికి మరో 3 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని... ఈ కాలమంతా ఫరూక్ పదవులు ఉన్నా, లేకున్నా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నారని చంద్ర‌బాబు ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నంద్యాల నియోజకవర్గాన్ని ఈ మూడేళ్లలోనే అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. పార్టీకి సంఘీభావంగా తరలివచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. నంద్యాలలో చేసిన అభివృద్ధిని చూసి నూటికి నూరుశాతం ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికే రావాలని, ఒక్క ఓటుకూడా చేజారకుండా చూడాలని, పటిష్ట వ్యూహాలతో కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు కోరారు. నంద్యాలలో పని చేసిన నాయకుల సేవలకు తగిన గుర్తింపునిస్తామని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.