Begin typing your search above and press return to search.

లోకేశ్‌ ని నమ్మి చంద్రబాబు దెబ్బయిపోయారా?

By:  Tupaki Desk   |   5 March 2019 1:30 AM GMT
లోకేశ్‌ ని నమ్మి చంద్రబాబు దెబ్బయిపోయారా?
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అంటే ఎత్తులకు పైఎత్తులు వేసే మేధావి.. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టే జాగ్రత్తపరుడు అంటారంతా. అందుకే ఆయన సంక్షోభాల నుంచి కూడా అవకాశాలు వెతుక్కోగలుగుతున్నారనీ చెప్తారు. కానీ.. గత నాలుగేళ్లుగా ఆయన బుర్ర పెద్దగా పనిచేస్తున్నట్లు లేదు. జారిపడిన చోటే అజాగ్రత్తగా అడుగులేసి మళ్లీమళ్లీ అజాగ్రత్తగా అడుగులేసి దెబ్బలు తాకించుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయి.. కేసీఆర్ చేతికి తన పిలక దొరికిన తరువాత తట్టాబుట్టా సర్దుకుని ఏపికి వచ్చేసిన చంద్రబాబు మళ్లీ అదే హైదరాబాద్‌ లో - ఎన్నికలకు ముందు మరోసారి అడ్డంగా దొరికిపోవడం చంద్రబాబుకే కాదు టీడీపీ నాయకులందరినీ టెన్షన్ పెడుతోందిప్పుడు.

ఏపీకి చెందిన కోట్లాది మంది ఓటర్ల డాటాను ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ దుర్వినియోగం చేస్తోందంటూ అందిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు ఆ ఐటీ సంస్థపై దాడులు చేయడం.. దాన్ని చంద్రబాబు ఖండిస్తుండడం వంటి పరిణామాలన్నీ తెలిసినవే. కొత్తగా తెలుసుకోవాల్సిందేంటంటే... ఈ పాపంలో లోకేశ్ బాబు పాత్ర ఉందట. ఆయన్ను నమ్మి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారట.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటిపారుదల శాఖ - పంచాయతీ రాజ్ శాఖలకు ఐటీ సేవలందించే పేరుతో ఎంటరైన ఈ సంస్థ టీడీపీకి కావాల్సిన ఎలక్షన్ పనిచేసిపెట్టే పనీ కుదుర్చుకుంది. పంచాయతీ రాజ్ శాఖ అంటే ఎవరిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రామీణ నీటిపారుదల కూడా రూరల్ డెవలప్‌మెంట్ శాఖ పరిధిలోకే వస్తుంది. దీనికీ లోకేశే మంత్రి.

అయితే.. ఈ సంస్థ బిగ్ డాటా అనాల్సిస్‌ సేవలు అందించే సామర్థ్యం ఉన్నదికావడంతో ఏపీలో ఓటర్ల వివరాలు - ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందినవారి వివరాల ఆధారంగా ఓటర్లలో ఎవరు ఎలా లబ్ధి పొందారన్నది ప్రాథమికంగా సార్ట్ అవుట్ చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు - సోషల్ మీడియా సైన్యాలు - సర్వే బృందాలు - క్యాంపెయినింగ్ ప్లాటూన్స్.. ఇలా అందరూ ఈ డాటా పట్టుకుని వెళ్లి గ్రామాల్లో - వార్డుల్లో ఒక్కొక్కరిని కలిసి నీకు చంద్రబాబు ప్రభుత్వం ఈలబ్ధి చేకూర్చింది అని చెప్పి ఓటేసి తీరాల్సిందేనని చెబుతున్నారు. ఈ తంతు చాలాకాలంగా జరుగుతున్నా ఇంత పక్కా డాటా అందించి ఓటర్లను డిఫెన్సులో పడేయగలిగింది ఈ సంస్థే అనేది ఇంతవరకు బటయకు రాలేదు.

ఇలా కాంటాక్ట్ చేసిన ఓటర్లకు మలి దశలో ఆన్ లైన్ - ఆఫ్ లైన్ - టెలీ లైన్ సర్వేల ఆధారంగా వారు ఓటేస్తారో లేదో గ్రహించి వెయ్యరనుకుంటే ఓటర్ల జాబితా నుంచి తొలగించే పని కూడా పెట్టుకున్నారన్నది విపక్షాల ఆరోపణ.

అయితే.. ఇదంతా చంద్రబాబు వరకు పూర్తిగా తెలియదు. ‘నాన్నారూ టెక్నాలజీ సంగతి నేను చూసుకుంటాను’ అని లోకేశ్ చెప్పడంతో ఆయన పాపం నమ్మాడు. కానీ.. పార్టీ కోసం అద్భుతంగా పనిచేసిన ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు చేయడంతో మొదటికే మోసమొచ్చింది. అదే విశాఖ, విజయడా, గుంటూరు, తిరుపతి ఇలా ఎక్కడో ఒక చోట ఆఫీసు పెట్టుకుని గుట్టుగా ఈ పని చేసుకుంటే కేసీఆర్‌కి మరోసారి ఇలా దొరికిపోయే పరిస్థితి వచ్చేది కాదు.

నిజానికి ఈ సంస్థ విశాఖ కేంద్రంగా పనిచేయడానికి ఒప్పందం చేసుకున్నా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోందట. అలా చేయడం వల్ల ఎప్పుడైనా దెబ్బతింటామని అంచనా వేయలేదో.. లేదంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని తెలుసుకోలేదో కానీ ఇప్పుడు మాత్రం దెబ్బయిపోయారు లోకేశ్. ఆ లోకేశ్‌ను నమ్మి చంద్రబాబు కూడా డిఫెన్సులో పడాల్సి వచ్చిందంటున్నారు టీడీపీ నేతలు.