Begin typing your search above and press return to search.

తెదేపాలో ఒక్కసీటుకు ఎందరు పోటీ పడ్తారో?

By:  Tupaki Desk   |   23 Oct 2017 4:55 AM GMT
తెదేపాలో ఒక్కసీటుకు ఎందరు పోటీ పడ్తారో?
X
ఇవి తక్షణం జరగబోతున్న ఎన్నికలు కాదు. మరో ఆరునెలల పాటూ కనీస గడువు ఉంది. కాకపోతే.. ఏపీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇప్పటినుంచే రకరకాల లాబీయింగ్ లు మొదలయ్యాయి. ఇంకా లోతుగా చెప్పాలంటే.. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎవరో ఒకరికి మాత్రమే పదవి దక్కే అవకాశం ఉంది. కానీ ఆ ఒక్క స్థానం కోసం పదుల సంఖ్యలోనే ఆశావహులు తయారవుతున్నారు. ఇదంతా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన సంగతి. వచ్చే ఏడాది మార్చినాటికి తెలుగురాష్ట్రాల్లో మొత్తం 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వీటిలో రెండు రాష్ట్రాలకు చెరి మూడు సీట్ల వంతున దక్కుతాయి. ఏపీకి వచ్చే మూడు సీట్లకు ఎన్నిక జరుగుతుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ కు ఒక స్థానం దక్కించుకునే అవకాశం ఎటూ ఉంటుంది. ఆ నేపథ్యంలో జగన్ ఎవరిని నిర్ణయిస్తే వారినే పదవి వరిస్తుంది. ఆ పార్టీ విషయంలో భిన్నాభిప్రాయం లేదు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే వారికి రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది. ఖాళీ అవుతున్న సీట్లలో ఒక ఎంపీ సీఎం రమేశ్ కూడా ఉన్నారు. సీఎం రమేశ్ కు చంద్రబాబునాయుడు మళ్లీ పదవిని కట్టబెట్టవచ్చు. పార్టీ ఎలాంటి హఠాత్పరిణామాలు ఎదురైనా సరే.. క్రైసిస్ మేనేజిమెంట్ స్థానంలో సీఎం రమేశ్ చక్రం తిప్పుతూ - వ్యవహారాలను చక్కబెట్టేస్తూ ఉంటారు. తెరమీద పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. తెర వెనుక వ్యవహారాల్లో ఆయన చాలా కీలకంగా పార్టీకి ఉపయోగపడుతుంటారనే పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడు విధిగా ఆయన పదవిని కొనసాగించాల్సి రావచ్చు. కాకపోతే ఇక ఒకే ఒక స్థానం మిగులుతుంది.

ఆ ఒక్క సీటు దక్కించుకోవడానికి పార్టీలో పలువురు సీనియర్లు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. సీనియారిటీ ప్రకారంగా కొమ్ములు తిరిగిన వాళ్లు... గతంలో చంద్రబాబునాయుడు నుంచి హామీలు పొందిన వాళ్లు - కొత్తగా పార్టీలో కీలకంగా మారి, తాము కష్టపడుతున్నాం కదా అనుకుంటున్న వాళ్లు - చంద్రబాబు పారిశ్రామికవేత్తలు- మేధావుల కోటాలో నాన్-పొలిటీషియన్స్ కు అవకాశం ఇస్తారు కదా అనే ఉద్దేశంతో ఆశపడుతున్నవారు ... ఇలా చాలా మందే తయారవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఫైనల్ గా దక్కే ఒక్కసీటును చంద్రబాబు ఎవరికి కట్టబెడతారో.. ఎందరిని నిరాశపరుస్తారో చూడాలి.