Begin typing your search above and press return to search.

ఈసారీ పెద్ద‌ల స‌భ‌కు వ్యాపార‌వేత్త‌లేనా బాబు?

By:  Tupaki Desk   |   28 Dec 2017 4:58 AM GMT
ఈసారీ పెద్ద‌ల స‌భ‌కు వ్యాపార‌వేత్త‌లేనా బాబు?
X
ఒక‌ప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన రాజ‌కీయ నేత‌లు చాలామందే క‌నిపించేవారు. ఎప్పుడైతే బాబు జ‌మానా మొద‌లైందో చ‌ట్ట‌స‌భ‌ల్లో మాట్లాడేవారు అంత‌కంత‌కూ త‌గ్గిపోవ‌టం మొద‌లైంది. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించే నేత‌ల్లో మాట్లాడే స‌త్తా ఉన్న వాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. రాజ‌కీయ నేత‌లుగా వ్యాపార‌.. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు పెద్ద‌పీట వేసే భాబు పుణ్య‌మా అని.. ఏపీకి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

విభ‌జ‌న వేళ‌.. ఏపీ త‌ర‌ఫున వాణిని వినిపించే నాథుడే లేక‌పోయారు. ఇది కూడా ఏపీకి ఎంతో న‌ష్టాన్ని క‌లిగించేలా చేసింది. మొన్న‌టికి మొన్న రాజ్య‌స‌భ‌కు ఖాళీ అయిన స్థానాన్ని భ‌ర్తీ చేసిన చంద్ర‌బాబు.. గ‌త పాఠాల్ని ప‌ట్టించుకున్న పాపాన పోయింది లేదు. క‌ర్నూలు జిల్లాకు చెందిన పారిశ్రామిక‌వేత్త టీజీ వెంక‌టేశ్‌ కు రాజ్య‌స‌భ సీటును కేటాయించ‌టం ద్వారా త‌న ప్రాధాన్య‌త ఏమిట‌న్న‌ది చెప్ప‌క‌నే చెప్పేశారు.

రాజ్య‌స‌భ‌కు ఎంపికైన టీజీ వెంక‌టేశ్‌.. ఏపీకి సంబంధించి ఏం మాట్లాడార‌న్న‌ది ఇప్ప‌టికైతే క‌నిపించింది లేదు. ఇదిలా ఉంటే.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 2న రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ప‌ద‌వీ కాలం ముగిసిపోనుంది. వీరంతా ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంపికైన వారు. వీరిలో ఏపీ నుంచి చిరంజీవి.. రేణుకా చౌద‌రి.. టి. దేవేంద‌ర్ గౌడ్ లు ఉండ‌గా.. తెలంగాణ నుంచి సీఎం ర‌మేశ్‌.. రాపోలు ఆనంద‌భాస్కర్ లు ఉన్నారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంపికైన ఈ ఐదుగ‌రిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా.. ఇద్ద‌రు టీడీపీకి చెందిన వారు. ప్ర‌స్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేక‌పోవటం.. తెలంగాణ‌లో అర‌కొర‌గా ఉన్న నేప‌థ్యంలో ఖాళీ అవుతున్న స్థానాల్లో కాంగ్రెస్‌ కు ఒక్క సీటు కూడా ద‌క్కే ఛాన్స్ లేదు. మొత్తం ఐదు స్థానాల్లో ఏపీకి మూడు.. తెలంగాణ‌కు రెండు స్థానాలు రానున్నాయి. తెలంగాణ‌కు వ‌చ్చే రెండు స్థానాల్లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున ప్ర‌తినిధులు ఎంపిక‌య్యే అవ‌కాశం ఉంది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. మొత్తం ముగ్గురిలో రెండు అధికార టీడీపీకి.. ఒక స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ద‌క్కే అవ‌కాశం ఉంది. ఏపీ అధికార‌ప‌క్షం జంపింగ్స్‌ ను ప్రోత్స‌హిస్తున్న వేళ‌.. రాజ్య‌స‌భకు స‌భ్యుడ్ని పంపే అవ‌కాశం ద‌క్కుండా కుట్ర ప‌న్నుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఏపీ అధికార‌ప‌క్షం ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యుల్ని పంపే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఆ రెండు ఎవ‌రికి ద‌క్కుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఒక స్థానాన్ని ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సీఎం ర‌మేశ్‌ కు ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు. త‌న‌కు మ‌రోసారి చంద్ర‌బాబు ఛాన్స్ ఇస్తార‌నే న‌మ్మ‌కంతో సీఎం ర‌మేశ్ ఉన్నారు. చంద్ర‌బాబుకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా.. స‌న్నిహితుడిగా ముద్ర ప‌డిన సీఎం ర‌మేశ్‌ కు ఛాన్స్ ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. అంతే.. మ‌రోసారి వ్యాపార‌వేత్త‌కు అవ‌కాశం ల‌భిస్తుంద‌న్న మాట‌. ఇక‌.. మిగిలిన మ‌రో సీటును ఎవ‌రికి కేటాయిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

పారిశ్రామిక‌వేత్త‌ల‌కు పెద్ద‌పీట వేయ‌కుండా.. ఈసారైనా రాష్ట్ర స‌మ‌స్య‌ల మీద అవ‌గాహ‌న ఉండి.. ఏదైనా అంశంపై మాట్లాడే స‌త్తా ఉన్న నేత‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. మ‌రి.. బాబు క‌మిట్ మెంట్లు ఎలా ఉన్నాయో చూడాలి.