Begin typing your search above and press return to search.

ఈసీకి - బాబుకు అదన్నమాట ‘బంధుప్రీతి’

By:  Tupaki Desk   |   15 March 2020 11:17 AM GMT
ఈసీకి  - బాబుకు అదన్నమాట ‘బంధుప్రీతి’
X
చంద్రబాబు ఆదేశించారు.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించారు’.. ఆదివారం సీఎం జగన్ నుంచి వచ్చిన ఈ మాట వైరల్ గా మారింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంపై సీఎం జగన్ ఆదివారం నిప్పులు చెరిగారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనరేట్ లో ఉన్న సెక్రెటరీకి ఇలాంటి ఆర్డర్ ఒకటి తయారవుతున్నట్లు తెలియదని.. ఎవడో రాస్తున్నారని.. ఎవరో ఆదేశాలు ఇస్తున్నారని.. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ చదువుతున్నారని సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని జగన్ అన్నారు.

151మంది ఎమ్మెల్యేలతో ప్రజా బలంతో గెలిచి అధికారంలోకి వచ్చిన తమకు పవర్ ఉంటుందా? ఎన్నికల కోడ్ ఉందని రమేష్ కుమార్ కు అధికారం ఉంటుందా అని సీఎం జగన్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వొద్దంటున్నారని.. తనకు ఆశ్చర్యంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు? సీఎంలు, ఎమ్మెల్యేలు ఎందుకని.. ఎన్నికల కమిషనర్లనే ముఖ్యమంత్రిగా చేసేవచ్చు కదా అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకం అయ్యారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఈ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ ప్రభుత్వం నియమించలేదు. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఎన్నికల కమిసనర్ చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిష్ఫాక్షపాతంగా విధులు నిర్వహించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

స్థానిక సంస్థల్లో టీడీపీకి సీట్లు దక్కవని.. వైసీపీ హవా ఖాయం అని భావించిన చంద్రబాబు తన పరపతితోనే ఎన్నికలు వాయిదా వేయించారన్న అనుమానం వైసీపీ ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఎన్నికల కమిషనర్ కు, చంద్రబాబు మధ్య ఏముందని వైసీపీ ప్రభుత్వం ఆరాతీయగా నమ్మలేని నిజం వెలుగుచూసినట్టు తెలిసింది.

ఇప్పటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూతురు నిమ్మగడ్డ శరణ్యను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్ కు అసోసియేట్ డైరెక్టర్ గా నియమించారట.. ఇలా కూతురుకు, తండ్రికి ఇద్దరికీ అత్యున్నత పదవులు ఇవ్వడం.. పైగా ఒకే సామాజికవర్గం కావడంతోనే రమేష్ కుమార్ తన స్వామి భక్తితో చంద్రబాబుకు అనుకూలంగా ఏపీలో చక్రం తిప్పుతున్నాడని వైసీపీ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దీనిపై అన్ని వైపుల నుంచి పోరుబాటకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఏపి ఎన్నికల కమిషనర్ ను తొలగించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు - నిమ్మగడ్డ రమేష్ బంధుప్రీతిని బయటపెట్టేందుకు రెడీ అయ్యారు.