Begin typing your search above and press return to search.

ఫైనల్ ఎటెంప్ట్ :చంద్రబాబు ఫెయిలైతే ఏంటి సంగతి?

By:  Tupaki Desk   |   29 Oct 2017 1:30 AM GMT
ఫైనల్ ఎటెంప్ట్ :చంద్రబాబు ఫెయిలైతే ఏంటి సంగతి?
X
చంద్రబాబు నాయుడు మడమ తిప్పడం లేదు. ఇదివరకు వెళ్లిన వాళ్లు మన రాష్ట్ర సమస్యను ఏ రకంగా రెప్రెజెంట్ చేశారనే తీరు మీద ఆయనకు నమ్మకం లేదో... లేదా, తాను స్వయంగా రంగంలోకి దిగి ఉంటే.. కార్యం తప్పక నెరవేరి ఉండేది అనే కాన్ఫిడెన్సే ఉన్నదో గానీ.. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో కాంట్రాక్టర్లను మార్చాలనే తన పట్టుదల నెగ్గించుకోవడానికి ఢిల్లీ పోతున్నారు. కేంద్రమంత్రి గడ్కరీ కి ఆయన ఇదే విషయాన్ని గతంలో ఆయన రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చెప్పారు. ప్రత్యేకంగా ఉరుకులు పరుగుల మీద నాగపూర్ కు వెళ్లి మరీ చెప్పి వచ్చారు. పైగా, ఆయనకు అర్థం కాని భాషలో, శైలిలో చంద్రబాబు చెప్పలేదు. అయినా సరే ఆయన ప్రతిపాదనల్ని కేంద్రం తిప్పికొట్టింది. ఆర్థిక భారం పెరిగే ఆలోచనకు జైకొట్టే ఛాన్సే లేదని తేల్చేసింది. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏ కొత్త పాయింటు చెప్పి వారిని ఒప్పించగలరు? ఒకవేళ ఆ ప్రయత్నంలో ఆయన మళ్లీ ఫెయిలైతే పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రశ్న.

పోలవరం పనులు సజావుగా సాగడం లేదని, ట్రాన్స్ ట్రాయ్ ను తక్షణం మార్చేసి వేరేవాళ్లను పెడదాం అనేది చంద్రబాబు ఆలోచన. చాన్నాళ్లు వారికి సహకరించిన చంద్రబాబు... ఇప్పుడు ఎందుకిలా వారిని తప్పించాలని చూస్తున్నారో తెలియదు. అయితే.. తప్పించకుంటే పోలవరం పూర్తయ్యే అవకాశం మాత్రం లేదని ఆయనకు క్లారిటీ వచ్చింది. పోలవరం గురించి చాలా డాంబికపు మాటలు చెప్పిన చంద్రబాబునాయుడు... గ్రావిటీద్వారా ఎన్నికల్లోగా నీళ్లిచ్చేస్తా అని చాలాసార్లు అన్నారు. కనీసం ఆ మాటనైనా నిలబెట్టుకోకపోతే.. ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు తనను క్షమించరని.. ఆయనకు చాలా స్పష్టత ఉంది. అందుకనే ఇంతగా ఆరాటపడుతున్నారు. చాలాకాలంగా ట్రాన్స్ ట్రాయ్ పనుల నిర్వహణలో ఎన్ని లోపాల గురించి తన దృష్టికి వస్తున్నప్పటికీ చూసీచూడకుండా పోతూ వారికి సహకరించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు విసిగిపోయారు.

కానీ పనుల నిర్వహణను దగ్గరుండి తానే పర్యవేక్షిస్తానని, కేంద్రమే పనులు చేయిస్తే ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదు గనుక.. తానే అన్నీ చూసుకుంటున్నానని పదేపదే చెప్పి.. కన్సల్టెంటు పాత్ర పోషిస్తున్న చంద్రబాబునాయుడు.. పనుల్లో జాగు జరుగుతోంటే.. బెత్తం పట్టుకుని అదిలించి చేయించాల్సిందిపోయి.. ఇలాంటి పరిష్కారం సూచించడం కేంద్రానికి నచ్చలేదు. ఖర్చు పెంచే సమస్యే లేదు అని వారంటున్నారు. వారు కేంద్ర అధికార్లను పంపి, ప్రాజెక్టు పనులు అధ్యయనం చేయించి.. ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా గడ్కరీ.. కాంట్రాక్టరు, సబ్ కాంట్రాక్టర్లు అందరితో విడివిడిగా సమావేశమై... వారి కష్టనష్టాలు కూడా తెలుసుకున్నారు. ఇంకా.. తాను స్వయంగా వెళితే కేంద్రాన్ని ఇన్ ఫ్లుయెన్స్ చేయగలననే నమ్మకంతో చంద్రబాబు వెళుతున్నారు. ఆయన సాధిస్తే చాలా మంచిది. కానీ ఆయన ప్రయత్నం ఫెయిలైతే.. పోలవరం పరిస్థితి ఏంటి. ఇది మిలియన్ డాలర్ ప్రశ్న.