Begin typing your search above and press return to search.

సీమ‌లో మంటలు ఎవ‌రి పుణ్యం బాబు?

By:  Tupaki Desk   |   27 Feb 2018 12:48 PM GMT
సీమ‌లో మంటలు ఎవ‌రి పుణ్యం బాబు?
X
ఏపీలో మ‌రోమారు ప్రాంతీయ ఉద్య‌మాలు తెర‌మీద‌కు వ‌చ్చాయ‌ని, త‌మ ప్రాంత ఆకాంక్ష కోసం సీమ‌నేత‌లు గ‌ళం విప్పుతున్నార‌ని అంటున్నారు. రాజ‌కీయ ప‌ర‌మైన ఉద్య‌మాలు కాకుండా స్వ‌తంత్రంగా ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని వివ‌రిస్తున్నారు. నేతలెవరూ ముందుండి నడిపించకపోయినా రాయలసీమలో పోరాటాలు కొనసాగుతున్నాయి. సీమకు జరిగిన అన్యాయంపై విద్యార్థులు - యువకులు - న్యాయవాదులు - రైతులు ముందుకు వచ్చి పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్నారు. వెనుకబాటుతనం - సీమపట్ల పాలకుల నిర్లక్ష్యంపై టీడీపీ - వైసీపీ - కాంగ్రెస్ - సీపీఎం - సీపీఎం కూడా నోరు మెదపడం లేదు. జనమే అన్నీతామై ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమాలు ఉద్ధృతమైన తరువాత రాజకీయపార్టీలు రంగప్రవేశం చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రజల సమస్యలు - వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై నిర్లక్ష్యం చేసిన పాలకులపై పోరాటాలు చేసే వామపక్ష పార్టీలు కూడా సీమ నిర్లక్ష్యంపై పోరాటాలు చేయడం లేదన్నది అక్షర సత్యమని పలువురు అంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు హైదరాబాద్‌ లోనే అభివృద్ది చేయడంతో రాష్ట్ర విభజనకు బీజం చేసి చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పడు కూడా ముఖ్యమంత్రి చేస్తున్న ఒకేవైపు అభివృద్ధి వల్ల రాయలసీమ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాయలసీమలో హంద్రీనీవా - గాలేరు నగరి - గురురాఘవేంద్ర కాలువ - తెలుగుగంగ తదితర పథకాలు ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి. అయితే ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు యుద్దప్రాతిపదికన పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేశారని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.. అలాగే రాజధాని నిర్మాణానికి కోసాంధ్ర ప్రాంతాన్ని ఎన్నుకోవడం, అక్కడే నిధులు పెట్టడంతో రాయలసీమను నిర్లక్ష్యానికి గురిచేశారని ప్రజల్లో బలమైన అభిప్రాయం నాటుకుంది. రాయలసీమ వాసులు ఒకవైపు విద్యాసంస్థలు - నీటి వాటా పెంపుతో పాటు ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ తో ముందుకుపోతున్నారు. పట్టిసీమను పూర్తిచేసిన సీఎం వేదావతి ప్రాజెక్టుపై నాలుగు సంవత్సరాలుగా హామీలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో చూడలేదన్న విమర్శ ఉంది.

రాష్ట్ర విభజన నేపధ్యంలో అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ జరుగుతుండడంతో సీమ ప్రజలు రగిలిపోతున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలన్న ఆందోళన తీవ్రమైంది. న్యాయవాదులు చేపట్టిన ఆందోళనకు విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. గుంతకల్లు జోన్ కోసం విద్యార్థి సంఘాలు ఉద్యమం తీవ్రతరం చేశాయి. గుంతకల్ రైల్వే జోన్ కోసం విద్యార్థి సంఘాల నాయకులు సంతకాలు సేకరణ - కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి బడికి వెళ్లి రాయలసీమ వెనుకుబాటుతనాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు. గుంతకల్లు రైల్వే జోన్ కోసం రాష్టప్రతి, ప్రధానమంత్రికి పోస్టుకార్డుల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.నీటి ప్రాజెక్టుల సాధన కోసం రాయలసీమ సాగునీటి సాధన కమిటీ పెద్దఎత్తున ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం అడ్డగించినప్పటికీ సిద్దేశ్వరం అలుగు శంఖుస్థాపన చేశారు. అలాగే పులికనుమ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులు కోసిగి నుంచి పులికనుమ వరకు యాత్రలు చేశారు. హంద్రీనీవాప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాలని రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చాయి. అనంతపురంలో రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు రాయలసీమకు జరిగిన అన్యాయంపై గళం విప్పారు. ఇదే సమయంలో కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా వందరోజులు నిరహార దీక్షలు నిర్వహించారు. కేంద్రం దృష్టికి ఉక్కు కర్మాగారం ఆవశ్యకతను తీసుకువెళ్లారు.

తాజాగా బీజేపీ నేతలు కర్నూలులో సమావేశమై బీజేపీ డిక్లరేషన్ పేరుతో రాయలసీమ వెనుకబాటుతనంపై ఓ నివేదిక జారీ చేయడంతో రాజకీయపార్టీల్లో గుబులు పుట్టిందని అంటున్నారు. సీమప్రాంతానికి 400 టీఎంసీల నీరు కావాలని ఎంతోకాలం నుంచి ఉద్యమాలు చేస్తున్నారని - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధులన్నీ అమరావతి వైపు మళ్లించి అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకరించడంతో సీమప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయని ప‌లువురు పేర్కొంటున్నారు.