Begin typing your search above and press return to search.

2019 ఎన్నికలకు కుదరని బాబు బ్యాలన్స్ ‘సీట్’

By:  Tupaki Desk   |   8 July 2018 6:58 AM GMT
2019 ఎన్నికలకు కుదరని బాబు బ్యాలన్స్ ‘సీట్’
X
ఇంట్లో సరకులన్నీ అయిపోయినప్పుడు ఇంటికి పది మంది అతిథులు వస్తామంటే ఎంత టెన్షన్ గా ఉంటుందో ఇప్పుడు ఎన్నికలొస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. 2014 ఎన్నికల తరువాత ఆబగా అన్ని పార్టీల నుంచి నేతలను తెచ్చి పెట్టుకున్నందుకు ఇప్పుడు ఆయన తెగ చింతిస్తున్నారట. 2014లో గెలిచేటప్పటికి బీజేపీతో కలిసి ఉండడం.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో ఎలాగైనా అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చనే పిచ్చి ధైర్యంతో చంద్రబాబు ఫిరాయింపులను తెగ ప్రోత్సహించారు. అదే ఇప్పుడు ఆయన కొంప ముంచుతోంది.

గత ఎన్నికల్లో గెలిచినవారు... ఓడిపోయినవారే కాకుండా కొత్తగా టిక్కెట్లు ఆశిస్తున్న బ్యాచ్ కూడా టీడీపీలో పెద్దదే ఉంది. వీరికి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు - ఇతర నేతలు తోడవుతున్నారు. దీంతో టిక్కెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారనుంది.

మరోవైపు వైసీపీ బాగా బలంగా ఉంది. బీజేపీ - జనసేన టీడీపీ ఓట్లు చీల్చడానికి కాళ్లకు కత్తులు కట్టుకుని తిరుగుతున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య చంద్రబాబుకు సీట్ల కేటాయింపు మరింత చీకాకు పెట్టే విషయంగా మారింది. అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్ల రెబల్స్ సమస్య పెరగనుంది. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని చంద్రబాబు తెగ టెన్షన్ పడుతున్నారట.

అయితే... ఎంపీలుగా ఉన్న పలువురు నేతలకు ఈసారి పక్కనపెట్టి వారి స్థానంలో ఇంతవరకు ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరికి టిక్కెట్లిచ్చి అసెంబ్లీ టిక్కెట్లలో కొత్తవారికి అవకాశమివ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.అయితే... టిక్కెట్లు ఇవ్వని ఎంపీల సంగతేం చేస్తారన్నది మాత్రం స్పష్టత లేదు.

ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న ఓ నేతను ఈసారి పార్లమెంటుకు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాయలసీమకు చెందిన ఓ ఎంపీకి కూడా టిక్కెట్ ఇవ్వకపోవచ్చని సమాచారం. అయితే.. దీనిపై చంద్రబాబు కూడా ఇంకా స్పష్టతకు రాలేదని... పార్టీ వర్గాలతో చర్చించి ఏం చేస్తారనేది నిర్ణయించే అవకాశముందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.