Begin typing your search above and press return to search.

'పశ్చిమ' లో బాబు నెగ్గుకురాగలడా.?

By:  Tupaki Desk   |   2 March 2019 7:16 AM GMT
పశ్చిమ లో బాబు నెగ్గుకురాగలడా.?
X
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయ పార్టీల్లో హడావుడి జోరందుకుంది. పార్టీ అభ్యర్థుల కోసం అధినేతలు కసరత్తులు చేస్తుంటే ఆశావహులు టిక్కెట్టు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రిజర్వు స్థానాల్లో టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ జిల్లాలో చింతలపూడి - కొవ్వూరు - గోపాలపురం - పోలవరం రిజర్వుడు స్థానాలున్నాయి. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన అధికార పార్టీ రిజర్వుడు స్థానాలను మాత్రం పెండింగ్‌ లో ఉంచింది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగులకు వీస్తున్న ఎదురుగాలే ఇందుకు కారణం.

కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి జవహర్‌ కు టిక్కెట్టు ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు టిక్కెట్టు కేటాయిస్తే ఓటమి తప్పదని - ఆయన మాకొద్దని కొవ్వూరు టీడీపీ నేతలు ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో జవహర్‌ ను కృష్ణా జిల్లా తిరువూరుకు పంపిస్తారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇక గోపాలపురం స్థానంలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముమ్మిడి వెంకటేశ్వర్‌ రావుపై స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో ఆయన సీటు మార్పు అనివార్యమిపిస్తోంది. ఇక్కడి సీటును మద్దిపాటి వెంకటరాజుకు టికెట్‌ ఇస్తారని అంటున్నారు.

చింతలపూడిలో మాజీ మంత్రిని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాము సూచించిన నేతలకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టి కూర్చున్నారు అసమ్మతి నేతలు. మంత్రి పదవి పోయినా అధిష్టానం సూచనల మేరకు తన పని తాను చేసుకుంటూ పోతున్న పీతల సుజాతపై అసమ్మతి వర్గం కొత్త ప్రచారం చేస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యే - మంత్రిగానే కాకుండా పార్టీలో సీనియర్‌ మహిళగా గుర్తింపు ఉన్న పీతల సుజాతపైనే అదిష్టానం మొగ్గు చూపుతున్నా అసమ్మతి వర్గం మాత్రం రోజుకో అభ్యర్థి పేరుతో పార్టీని గందరగోళంలో పడేస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం ఈ స్థానాన్ని పెండింగ్‌ లో పెట్టింది.

జిల్లాలో కీలక నియోజవర్గమైన పోలవరంలోనూ అదే పరిస్థితి నెలకొంది. సౌమ్ముడిగా పేరున్న ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ కు టిక్కెట్‌ కేటాయించాలని ఆయన వర్గీయులు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఆర్థిక స్థోమతకు తోడు ప్రజాబలం ఉన్న నేతలకే టిక్కెట్‌ ఇస్తామని పార్టీ అధినేత ఈ నియోజకవర్గం టిక్కెట్టుపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇలా ఎన్నికల ముందు మిగతా స్థానాల కంటే రిజర్వుడు స్థానాల్లోనే రాజకీయం రసవత్తంగా సాగుతోంది.