Begin typing your search above and press return to search.

సుజనా శల్యసారథ్యాన్ని గుర్తించిన చంద్రబాబు!

By:  Tupaki Desk   |   7 Feb 2018 5:51 AM GMT
సుజనా శల్యసారథ్యాన్ని గుర్తించిన చంద్రబాబు!
X
ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడే గానీ.. తన చేతల వల్ల అంతిమప్రయోజనం కేంద్రంలోని మోడీ సర్కారుకు కలిగేలాగా ప్రవర్తిస్తున్నారా? కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యవహార సరళిని పరిశీలించిన చాలా మందికి ఇలాంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. తొలిసారిగా ముఖ్యమంత్రం చంద్రబాబునాయుడు కూడా సుజనా చౌదరి వైఖరి మీద బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎంతో సీరియస్ ఎప్రోచ్ తో.. కేంద్రంతో సంబంధాలు ఉంచుకోవాలా? తుంచుకోవాలా? అనే స్థాయిలో సమావేశం నిర్వహిస్తే.. సమావేశం తర్వాత.. బయటకు వెళ్లి.. ఇది రొటీన్ సమావేశమే.. అంటూ సుజనా చౌదరి మీడియాతో వ్యాఖ్యానించడం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇది చాలా అవమానకరం అని ఆయన పార్టీ నాయకులతో అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

సాధారణంగా పార్లమెంటు సమావేశాలు షెడ్యూలు అయిన తర్వాత.. అవి ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు దాదాపుగా అన్ని పార్టీల అధినేతలు తమ ఎంపీలతో ఓ యాక్షన్ ప్లాన్ సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. పార్లమెంటు సమావేశాలలో తాము ఎలాంటి పోకడ అనుసరించాలో ఆ భేటీల్లో చర్చించుకుంటూ ఉంటారు. ఏం డిమాండ్ చేయాలో మార్గదర్శనం చేస్తూ ఉంటారు. చంద్రబాబు కూడా ప్రతిసారీ అలా నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు అలాంటి సన్నాహక సమావేశం జరగలేదు. తీరా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ కు ఎంత అన్యాయం జరిగిందో అందరి దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఆదివారం నాడు ఎంపీలతో సమావేశానికి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. బడ్జెట్ అన్యాయం నేపథ్యంలో భాజపాతో సంబంధాల కొనసాగింపు అనేది ప్రధాన ఎజెండాగా ఆయన సమావేశం నిర్వహించారు.

అయితే సమావేశం అనంతరం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన సుజనా చౌదరి మాత్రం.. ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందు జరిగే రొటీన్ సమావేశం లాంటిదే అని ప్రకటించారు. ఇలాంటి ప్రకటన వల్ల.. తమ సమావేశం సీరియస్ నెస్ మొత్తం మంటగలిసిపోయిందని , పరువు పోయిందని చంద్రబాబునాయుడు భావించినట్లుగా తెలుస్తోంది. సుజనా చౌదరి తెలుగుదేశానికి శల్య సారథ్యం చేస్తున్నారేమో అనే సంగతిని పార్టీ అధినేత గుర్తించినట్లుగా కనిపిస్తోందని కూడా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.