Begin typing your search above and press return to search.

మరో రచ్చకు ముహుర్తం పెట్టేసిన బాబు

By:  Tupaki Desk   |   13 Sep 2019 5:34 AM GMT
మరో రచ్చకు ముహుర్తం పెట్టేసిన బాబు
X
ఏపీ అధికారపక్ష నేతలు తమ పార్టీ నేతలపై దాడి చేస్తున్నారని.. వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు హాహాకారాలు చేయటం తెలిసిందే. అధికార బదిలీ జరిగిన తర్వాత.. సున్నిత ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం మామూల. ఇలాంటివేళ.. వీలైనంతవరకూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. రాజకీయ స్వార్థం కంటే కూడా.. వర్గాల మధ్యనున్న ఉద్రిక్తతల్ని నివారించే ప్రయత్నం చేయాలి.

ఎంతసేపటికి తన పొలిటికల్ మైలేజీ మీద ఫోకస్ చేసే చంద్రబాబు.. ఛలో ఆత్మకూరు పేరుతో ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసి.. నానా రచ్చ చేశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇంకా సద్దుమణగక ముందే.. మరో ప్రోగ్రామ్ ను డిసైడ్ చేసిన ఆయన తీరుపై పోలీసు శాఖ గుర్రుగా ఉంది. తమ పార్టీ కార్యకర్తలు ఊళ్లు వదిలిపెట్టి.. వేరే ప్రాంతాలకు వెళ్లి బతకాల్సి వస్తోందన్నారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ మద్దతుదారులతో ఫోన్లో మాట్లాడారు. వేరే గ్రామాల్లో తలదాచుకుంటున్న వారిని తిరిగి వారి గ్రామాల్లో చేర్చే కార్యక్రమానికి పిలుపునివ్వటం.. అది కాస్తా ఉద్రిక్తంగా మారటంతో.. పోలీసులు సైతం అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ లను హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ నేతల్ని బాబు ఇంటికి రాకుండా అడ్డుకున్నారు.

దాడుల భయంతో వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన టీడీపీ నేతలు.. కార్యకర్తల్ని ఆత్మకూరుకు చేర్చారు పోలీసులు. ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరైన మాజీ సర్పంచ్ ఏసోబుతో చంద్రబాబు మాట్లాడారు. ఊళ్లో ఎలా ఉన్నారు? ఇళ్లు ఎలా ఉన్నాయి? సమస్యలేమైనా ఉన్నాయా? పోలాలకు వెళుతున్నారా? లాంటి ప్రశ్నలు వేసిన బాబుకు.. ఏసోబు సమాధానమిస్తూ.. గడిచిన మూడు నెలల్లో ఊళ్లో లేకపోవటం కారణంగా ఇళ్లు అన్ని పాడుపడిపోయాయని చెప్పారు. వాటిని తాము బాగు చేసుకుంటున్నట్లు చెప్పారు.

పార్టీ కార్యకర్తలు అస్సలు భయపడొద్దని.. ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ పూర్తి అండ ఉంటుందన్న మాట ఇచ్చిన చంద్రబాబు.. తాను వచ్చే బుధవారం ఆత్మకూరుకు వస్తానని.. అందరిని కలుస్తానని మాట ఇచ్చారు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తీవ్రంగా ఉన్న వేళ.. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే కన్నా.. వాతావరణం మారే వరకూ వెయిట్ చేసి వెళితే బాగుంటుందంటున్నారు. పొలిటికల్ మైలేజీ మాత్రమే కోరుకునే చంద్రబాబు లాంటి వారికి ఇలాంటి అంశాలేమీ పట్టవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.