Begin typing your search above and press return to search.

హుజూర్‌ న‌గ‌ర్ టీడీపీ టిక్కెట్ రేసులో ఆ ఇద్ద‌రు..!

By:  Tupaki Desk   |   28 Sep 2019 9:59 AM GMT
హుజూర్‌ న‌గ‌ర్ టీడీపీ టిక్కెట్ రేసులో ఆ ఇద్ద‌రు..!
X
తెలంగాణ‌లో సూర్యాపేట జిల్లా హుజూర్‌ న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇక ఈ స్థానానికి ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు అయిన టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్‌ - బీజేపీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. అంద‌రికంటే ముందుగా టీఆర్ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ త‌మ అభ్య‌ర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరు ప్ర‌క‌టించారు. సైదిరెడ్డి గ‌త డిసెంబ‌ర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డిపై పోటీ చేసి 7 వేల ఓట్ల తేడాతో ఓడినా గ‌ట్టిపోటీ ఇచ్చారు.

ఇక కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి భార్య‌ - కోదాడ మాజీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి అభ్య‌ర్థిత్వం ఖ‌రారైంది. బీజేపీ నుంచి ప‌లువురు పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చినా చివ‌ర‌కు కోట రామారావు వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి దాదాపు అవ‌సాన ద‌శ‌కు వ‌చ్చేసింది. డిసెంబ‌ర్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా ఘోరంగా ఓడిపోయింది. ఇక ఏప్రిల్‌లో జ‌రిగిన లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండ‌డంతో పాటు కాంగ్రెస్‌ కు స‌పోర్ట్ చేసింది.

లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో పోటీకే దూరంగా ఉన్న టీడీపీ ఇప్పుడు హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లు చేస్తుండ‌డం అంద‌రికి షాక్ ఇస్తోంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. హుజూర్ నగర్ లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపాలని పలువురు నేతలు ఆయనకు సూచించారు. మ‌రోవైపు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఇక్క‌డ టీడీపీ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌కు రిక్వెస్ట్ చేశారు. టీడీపీ మాత్రం ఇక్క‌డ పోటీ చేసి త‌మ బ‌లం ఎంతో టెస్ట్ చేసుకునే ప‌నిలో ఉంది.

హుజూర్‌ న‌గ‌ర్‌ లో పార్టీ పోటీ చేయాలా ? వ‌ద్దా ? అనే అంశంపై శ‌నివారం నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు స్ప‌ష్టం చేశారు. ఇక ఇక్క‌డ టీడీపీ త‌ర‌పున పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి న‌న్నూరి న‌ర్సిరెడ్డితో పాటు హుజూర్‌ న‌గ‌ర్ మాజీ ఎంపీపీ చావా కిర‌ణ్మ‌యి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ అంటూ పోటీ చేస్తే ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ? ఒక‌రు రేసులో ఉంటార‌ని తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఏడు మండ‌లాలు ఉండ‌గా.. కొన్ని మండ‌లాల్లో క‌మ్మ వ‌ర్గం ఓట‌ర్లు ప్రభావితం చేయ‌నున్నారు. అలాగే ఆంధ్రా ఓట‌ర్లు కూడా ఎక్కువే. అందుకే ఇక్క‌డ టీడీపీ పోటీకి ఉత్సాహం చూపుతోంది.