Begin typing your search above and press return to search.

టీడీపీ కోసం బాబు గారి ఆఖ‌రి ప్ర‌య‌త్నం!

By:  Tupaki Desk   |   29 Sep 2019 1:30 AM GMT
టీడీపీ కోసం బాబు గారి ఆఖ‌రి ప్ర‌య‌త్నం!
X
తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి...కొడి గట్టిన దీపంలా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లోని ముఖ్య‌నేత‌లు..పార్టీ బ‌లంగా ఉన్న‌ప్పుడు ఆ వేదిక‌ను ఉప‌యోగించుకొని...అనంత‌రం ఆ పార్టీకి గుడ్‌ బై చెప్తూ టీఆర్ ఎస్‌ - బీజేపీలో చేరుతున్నార‌ని కొంద‌రు ఆరోపిస్తున్న సంద‌ర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఆప్తుల‌నే పేరున్న నేత‌లు త‌మ భ‌విష్య‌త్తును కాపాడుకునేందుకు తీసుకున్న నిర్ణ‌యాల‌తో ఈ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, తాజాగా...చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ‌లో టీడీపీకి పూర్వ‌వైభ‌వం కోసం ఆయ‌న పార్టీ నేత‌ల‌కు కీల‌క హామీ ఇచ్చారు. అదే ప్ర‌స్తుత హుజూర్‌ న‌గ‌ర్ ఉప‌ ఎన్నిక‌లో పోటీ చేయ‌డం.

టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహిత నేత అనే పేరున్న పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యం వెల్ల‌డించారు. హుజూర్‌ నగర్‌ లో టీడీపీ సొంతంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ తెలుగుదేశం అనేక సమావేశాలు నిర్వహించామ‌ని - హుజూర్‌ నగర్ ఎన్నిక-పోటీపై అందరం సమాలోచన చేశామ‌న్నారు. అందరి నిర్ణయం కూడా హుజూర్ నగర్ లో టీడీపీ సొంతంగా పోటీ చేయాలనే వ్య‌క్తమైంద‌న్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరు రేపు ఉదయం ప్రకటన చేస్తామ‌ని వివ‌రించారు.

త‌మ పోటీ గురించి రావుల చంద్రశేఖర్ రెడ్డి వివ‌రిస్తూ...తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవడానికి ఈ పోటీ అని స్ప‌ష్టం చేశారు. మొదటి నుంచి నల్గొండ - హుజూర్‌ నగ‌ర్‌ లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని ఆయ‌న తెలిపారు. ఆడపడుచులకు సమాన హక్కు,పేదలకు ఇళ్ళు కట్టించింది టీడీపీ అని - హైటెక్ సిటీ నిర్మాణం టీడీపీ వల్లనే జరిగిందన్నారు. హైద‌రాబాద్‌ లో మెట్రో రైల్ ఆనాటి టీడీపీ ఆలోచన అని చెప్పారు. టీడీపీ అంటేనే అభివృద్ధి చేసే పార్టీ అని స్ప‌ష్టం చేసిన ఆయ‌న టీడీపీకి నాయకులు కాదు కార్యకర్తలే బలమ‌ని స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు గత కొంతకాలంగా ఎన్టీఆర్ భవన్‌ కు వస్తుంటే అశేషంగా ప్రజల నుంచి స్పందన వస్తుంద‌న్నారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది అంటున్న వారికి...టీడీపీ కార్యకర్తలు తలెత్తుకునేలా - టీడీపీకి పూర్వ వైభవం వచ్చేలా ఎన్నికలో టీడీపీ ప్రభావం చూపిస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.