Begin typing your search above and press return to search.

బాబు జ‌మానా!... అంతా తాత్కాలికమే!

By:  Tupaki Desk   |   1 Feb 2018 7:55 AM GMT
బాబు జ‌మానా!... అంతా తాత్కాలికమే!
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నోట ఇప్పుడు శాశ్వ‌త‌మ‌న్న మాటే వినిపించ‌డం లేదు. నాలుగేళ్ల క్రితం ఏపీ సీఎంగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని త్వ‌రిత‌గ‌తిన బ‌య‌ట‌ప‌డవేసేందుకు రాత్రింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్న‌ట్లు క‌ల‌రింగ్ ఇచ్చుకున్న వైనం మ‌న‌కు తెలిసిందే. క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా ఏర్ప‌డిన ఏపీ పాల‌న‌ను ప‌దేళ్ల పాటు హైద‌రాబాదు నుంచే సాగించే వీలున్నా... ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన కార‌ణఃగా చంద్ర‌బాబు దానిని అప్ప‌టిక‌ప్పుడు ఎలాంటి ముంద‌స్తు ప్ర‌ణాళిక లేకుండానే విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. వెర‌సి కేసు భ‌యంతో ఉన్న తాను ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నానో, మీరు కూడా ఆ ఇబ్బంది ఎదుర్కోవాల్సిందేన‌ని ఆయ‌న అధికారుల‌తో పాటు ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను చివ‌ర‌కు త‌న సొంత కేబినెట్ మంత్రుల‌ను కూడా సౌక‌ర్యాల లేమితో పాల‌న సాగించే విధానాన్ని వారికి ప‌రిచ‌యం చేసేశారు. ఓ సీఎం స్థాయి వ్య‌క్తే ఇలా వ్య‌వ‌హ‌రిస్తే.. చేసేదేముంటుంది? చెప్పేదేముంటుంది? అంతా కూడా చంద్ర‌బాబు వెంట న‌డ‌వ‌క త‌ప్ప‌లేదు. హైద‌రాబాదు నుంచి అమ‌రావ‌తికి వ‌చ్చేందుకు అధికార యంత్రాంగం కొంత‌మేర వ్య‌తిరేకించినా... న‌యానో- భ‌యానో వారిని దారికి తెచ్చుకున్న చంద్ర‌బాబు.. ఎట్ట‌కేల‌కు మొత్తంగా ఏపీ పాల‌నా యంత్రాంగాన్ని అమ‌రావ‌తికి త‌ర‌లించేశారు.

ఇక్క‌డ అమ‌రావ‌తి అంటే అదేదో స‌ర్వ హంగులున్న న‌గ‌రంగా గొప్ప‌గా చెప్పుకోవ‌డానికి ఏమీ లేదన్న విష‌యం తెలిసిందే క‌దా. గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి ప్రాంతంలో కొంత‌మేర భూభాగాన్ని ఎంపిక చేసి దానికే అమ‌రావ‌తి అని పేరు పెట్టేశారు. అయితే అందులో ఏపీ పాల‌నా యంత్రాంగం కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన ఏర్పాట్లు అస్స‌లే లేవు. మొన్న‌టికి మొన్న ఉద్యోగుల విధి నిర్వ‌హిణ కోస‌మంటూ ఏర్పాటు చేసిన వెల‌గ‌పూడి స‌చివాలయం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న నిర్మించిందే. వంద‌ల కోట్ల రూపాయల ఖ‌ర్చు చేసి క‌ట్టించిన ఈ భ‌వనం ఏ మేర క్వాలిటీతో క‌ట్టారో... మొన్న‌టి వ‌ర్షాలే చెప్పేశాయి. చిన్న‌పాటి వ‌ర్షానికే స‌చివాల‌యం ఓ చిన్న వాగునే త‌ల‌పించింది. ఆ త‌ర్వాత దానికి స‌మీపంలోనే నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయం ప‌రిస్థితి కూడా అంతే. ఈ భ‌వ‌నానికి కూడా వంద‌ల కోట్లే ఖ‌ర్చు అయినా... చిన్న వ‌ర్షానికే రూఫ్ మొత్తం జ‌ల్లెడలా కారిపోయింది. స‌రే ఈ భ‌వ‌నాలు తాత్కాలిక ప్రాతిప‌దిన నిర్మించారులే... శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న క‌ట్టే బిల్డింగులు ఈ మాదిరి ఉండ‌వులే అనుకున్నా... ఇప్ప‌టికిప్పుడు అక్క‌డ శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నిర్మించే భ‌వ‌నాలే క‌నిపించే దాఖ‌లా లేదు. ఎందుకంటే.. వెల‌గ‌పూడి స‌చివాలయం ప‌క్క‌నే మ‌రో రెండు నిర్మాణాల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా... ఆ భ‌వ‌నాలు కూడా తాత్కాలిక ప్రాతిప‌దిక‌న నిర్మించేవేన‌ట‌. అంటే మొత్తం చంద్ర‌బాబు ఈ ఐదేళ్ల పాల‌న‌లో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఒక్క భ‌వ‌నాన్ని కూడా నిర్మించిన పాపాన పోలేద‌ని చెప్పాలి.

అమ‌రావ‌తిలో కొత్త‌గా ప్ర‌తిపాదించిన బిల్డింగుల విష‌యానికి వ‌స్తే.. అసెంబ్లీ సెక్ర‌టేరియ‌ట్‌ - అధికార‌ - విప‌క్ష పార్టీల‌కు సంబంధించిన కార్యాల‌యాల‌కు ఉద్దేశించి ఓ భ‌వ‌నాన్ని నిర్మించేందుకు బాబు సర్కారు నిర్ణ‌యం తీసుకుంది. అదే స‌మ‌యంలో అక్క‌డే హైకోర్టు కార్య‌క‌లాపాల‌కు సంబంధించి మ‌రో భ‌వ‌నాన్ని కూడా నిర్మించ‌నున్నారు. అయితే ఈ రెండు కూడా స‌చివాల‌యం, అసెంబ్లీ త‌ర‌హాలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్న‌వేన‌ట‌. మొత్తంగా ఈ ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు ఒక్క శాశ్వ‌త నిర్మాణాన్ని చేప‌ట్ట‌ద‌న్న మాట‌. మ‌రి అసెంబ్లీకి ఓ రూపు తీసుకొచ్చిన త‌ర్వాతే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం మీ ముందుకు వస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు... మ‌రో ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఓట్లు ఏ ప్రాతిప‌దిక‌న అడుగుతారో చూడాలి. ఇదిలా ఉంటే రాజ‌ధాని నిర్మాణం కోసం కేంద్రం ఇప్ప‌టిదాకా తాత్కాలిక నిర్మాణాల‌కే త‌గ‌లేసిన చంద్ర‌బాబు... ఈ దఫా కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌ను మ‌రో రెండు తాత్కాలిక నిర్మాణాల‌కే ఖర్చు చేయ‌నున్నార‌న్న మాట‌. వెర‌సి రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం ప్ర‌భుత్వాన్ని ఇక‌పై నిధులు అడిగే హ‌క్కును ఏపీ ప్ర‌జ‌ల‌కు లేకుండా చంద్ర‌బాబు చేస్తున్నార‌న్న మాట‌.