Begin typing your search above and press return to search.

టీటీడీపీ నేత‌ల‌ను గాలికి వ‌దిలేసిన బాబు

By:  Tupaki Desk   |   9 Sep 2018 10:23 AM GMT
టీటీడీపీ నేత‌ల‌ను గాలికి వ‌దిలేసిన బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు రాజ‌కీయంగా త‌న‌ను తాను ప్ర‌శ్నార్థ‌కం చేసుకునే స్థితికి చేరుకున్నార‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ మూల సిద్ధాంతాల‌కు విరుద్ధంగా కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవ‌డంతో పాటుగా...ఆ పార్టీ నేత‌ల ద‌గ్గ‌ర సీట్ల గురించి దేబిరించే ప‌రిస్థితి తీసుకురావ‌డాన్ని ఉద‌హ‌రిస్తూ ప‌లువురు ఈ కామెంట్లు చేస్తున్నారు. ముంద‌స్తు ఎన్నికల నేప‌థ్యంలో శ‌నివారం - ఆదివారం తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలతో భేటీ అయి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి - బలం - బలహీనతలపై సుదీర్ఘంగా చర్చించారు.

జీహెచ్ ఎంసీ - రంగారెడ్డి - మేడ్చల్ జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతవాసులు ఎంత మంది ఉంటారు? వారిలో ఎంతమంది ఓటర్లు? వంటి సమగ్ర వివరాలతో చిట్టా తయారుచేయాలని పార్టీ వర్గాలను ఆదేశించినట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో గెలిచిన 15 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాల‌ని బాబు సూచించినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో తమవల్లే బీజేపీ ఐదు సీట్లు గెలిచిందని, ఈసారి వారిని గెలువకుండా చూడాలని పిలుపునిచ్చినట్టు సమాచారం.17 లోక్ సభ స్థానాలకు గాను రెండు అంతకంటే ఎక్కువ స్థానాలు అడగాలని చంద్రబాబుతో భేటీ సందర్భంగా నాయకుల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ఖమ్మం - మల్కాజిగిరిలో టీడీపీకి పట్టు ఉన్నందున, ఈ సీట్లు కచ్చితంగా అడగాలని నిర్ణయించారని తెలుస్తోంది.పొత్తుపై స్థానిక రాజకీయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని చెప్తే అమలు చేస్తానని చంద్రబాబు పేర్కొన్నట్లు స‌మాచారం. తన సమక్షంలో కాంగ్రెస్‌ తో పొత్తు - తాను తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపితే ఏపీలో నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు దూరం జరిగినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ....కాంగ్రెస్‌ తో పొత్తు విషయంపై పార్టీ నేతలు అంతర్గతంగా ఓకే చెప్పినట్టు తెలిసింది.

కాగా, కాంగ్రెస్‌-టీడీపీల మ‌ధ్య పొత్తు విష‌యంలో కీల‌క చ‌ర్చ‌లు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం. మరోవైపు టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ఢిల్లీలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ తో ఇదే విషయమై చర్చించారని, ఇరుపార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ తో పాటు సీపీఐ - కోదండరాం పార్టీలతో చర్చలు జరపనున్నారు. నేటి సాయంత్రం సీపీఐ నేతలతో, రేపు (సోమవారం) కోదండరాంతో చర్చించే అవకాశముంది. కాగా, అధికారం శాశ్వతం కాదని, విలువలు శాశ్వతం అంటూ పాఠాలు చెప్పే చంద్రబాబు ఈ పొత్తుతో నైతికంగా తన ఓటమిని ఒప్పుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.