Begin typing your search above and press return to search.

అమరావతి మొత్తం లీకేజీల నగరం అవుతుందా?

By:  Tupaki Desk   |   10 Aug 2017 4:28 PM GMT
అమరావతి మొత్తం లీకేజీల నగరం అవుతుందా?
X
2019 ఎన్నికలు వచ్చేలోగా.. రాజధాని అమరావతిలో ఏదో చేసేసినట్లుగా కనిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా ఆత్రుత పడుతున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి తన పరిస్థితి మరీ అగమ్యగోచరంగా ఉంటుందనే ఆందోళన ఆయన అధికంగా ఉన్నట్లున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటిదాకా అమరావతి నగరంలో నిర్దిష్టంగా పనులంటూ ఏమీ జరగకపోయినప్పటికీ.. ఏదో అయిపోయినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఒక భ్రమ కల్పించడానికి ఆయన తపన పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి గురువారం కూడా మెడిసిటీ పేరుతో ఒక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీని సంగతి పక్కన పెడితే.. గవర్నరు, సీఎం, మంత్రులు, ఐఏఎస్ లు వంటి వారి క్వార్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల నిర్మాణానికి సంబంధించి పనులను చంద్రబాబు పురమాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నివాసాల ప్రాజెక్టులో.. మొత్తం 4016 యూనిట్లు అవసరం అవుతాయని, ఇందులో 3820 నివాస యూనిట్లు అపార్ట్ మెంట్ల తరహాలో ఉంటాయనే నిర్ణయం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఉద్యోగులు అందరికీ 3820 నివాస యూనిట్లు దక్కుతాయన్నమాట. అయితే ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం గురించి.. చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాలే అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2018లోగా ఈ నిర్మాణాలు మొత్తం పూర్తి చేసేయాలని చంద్రబాబు సీఆర్డీయే అధికార్లను ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇంత తొందరపాటుతో పూర్తిచేయాల్సిన అవసరం ఏంటనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వెలగపూడి సచివాలయాన్ని కూడా ఇదే తరహాలో.. హడావుడిగా పూర్తిచేసే ప్రయత్నం చేశారు. చెప్పిన వ్యవధి కంటె చాలా ఆలస్యమే జరిగింది కానీ.. ఆ సచివాలయం మొత్తం ఇప్పటికీ లీకేజీ ల నిర్మాణాలుగా ముద్రపడిపోయాయి. సాక్షాత్తూ మంత్రుల చాంబర్ లు కూడా లీకేజీ అవుతూ.. చాలా మందిని అభద్రతకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు 3820 నివాస యూనిట్లు వచ్చే అపార్ట్ మెంట్లు, గవర్నర్ మంత్రుల బంగళాలు లాంటివన్నీ కూడా ఏడాదిలో పూర్తి చేసేయాలనే తొందరపాటు వల్ల.. అమరావతి నగరం మొత్తం లీకేజీల నగరంగా తయారవుతుందేమోనని పలువురు భయపడుతున్నారు. ఏదో ఆఫీసులో లీకేజీ అంటేఅదొక ఎత్తు... నివాసాలు కూడా లీకేజీల మయంగా ఉంటే బతుకు దుర్భరం అవుతుందని.. చంద్రబాబు కాస్త సమయం తీసుకుని అయినా.. కాస్త దృఢంగా నాణ్యంగా ఉండే నిర్మాణాలు చేయిస్తే బాగుంటుందని.. ఎన్నికల్లోగా బిల్డప్ లకోసం కాకుండా, నివాసాలు అందరికి నివాసయోగ్యంగా ఉండడానికి చేయాలని పలువురు ఆశిస్తున్నారు.