Begin typing your search above and press return to search.

2018కి కూడా అమ‌రావ‌తి రెడీ అవ‌దా..!

By:  Tupaki Desk   |   16 Aug 2016 1:12 PM GMT
2018కి కూడా అమ‌రావ‌తి రెడీ అవ‌దా..!
X
ఏపీ ప్ర‌భుత్వం - సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్మినెంట్ స‌చివాల‌యం - అసెంబ్లీ - హైకోర్టు త‌దిత‌ర భ‌వ‌నాల నిర్మాణం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. వీటి నిర్మాణాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ 2018 నాటికి పూర్తి చేసి.. 2019 లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌చారాస్త్రంగా మ‌లుచుకోవాల‌ని టీడీపీ అధినేత భావించారు. అదే క్ర‌మంలో అన్ని అనుమ‌తులు స‌హా రైతుల నుంచి భూ స‌మీక‌ర‌ణ‌ - నిధులు వంటి వాటిని వేగ‌వంతం చేశారు. జ‌పాన్ స‌హా ఇత‌ర దేశాలు తిరిగి ఆర్కిటెక్ట్‌ ల‌ను అమ‌రావ‌తికి ర‌ప్పించారు. ఇలా ప్ర‌తి అంశంలోనూ చంద్ర‌బాబు ప్ర‌త్యేక ఇంట్ర‌స్ట్ చూపించారు. అయితే చంద్ర‌బాబు ఎంత స్పీడ్‌ గా ఉన్నా.. అమ‌రావ‌తి నిర్మాణాలు మాత్రం అంత స్లో గా ఉన్నాయి.

ఎందుకంటే.. ఈ నిర్మాణాల‌కు సంబంధించిన ప్లాన్స్‌ నే ఇప్ప‌టి వ‌ర‌కు డిసైడ్ చేయ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌పాన్ కంపెనీ మాకి ఇచ్చిన ప్లాన్ బాగోలేద‌ని ఫీడ్ బ్యాక్ రావ‌డంతో మొత్తం ప్ర‌క్రియ డెడ్ స్లో అయిపోయింది. దీంతో 2018 నాటికి అమ‌రావ‌తిలో నిర్మాణాలు పూర్త‌య్యే సీన్ లేద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ విష‌యం ఏంటో చూద్దాం.. ఏపీ రాజ‌ధానిని కృష్ణాన‌ది ఒడ్డున నిర్మించాల‌ని డిసైడైన సీఎం చంద్ర‌బాబు.. రాయపూడి సమీపంలో 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయాన్ని నిర్మించాలని తీర్మానించారు. దీంతో ఆ ప్రాంతంలో ప్ర‌భుత్వ‌ భవనాలు ఎలా ఉండాలనే దానిపై 8 నెలల క్రితం అంతర్జాతీయ స్థాయిలో డిజైన్లను ఆహ్వానించారు.

లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్ - మన దేశానికి చెందిన వాస్తు శిల్ప కన్సల్టెంట్ - జపాన్‌ కు చెందిన మకి అసోసియేట్స్ పోటీ ప‌డ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక క‌మిటీ.. ‘మకి’ డిజైన్‌ ను ఎంపిక చేసింది. దాన్ని ఆమోదించిన ప్రభుత్వం ఏడాదిలోగా పూర్తిస్థాయి డిజైన్లు ఇచ్చేలా ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవాల‌ని భావించింది. అయితే, మ‌కి డిజైన్లు మీడియాలో రావ‌డంతో వీటిని చూసిన సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి మేధావుల వ‌ర‌కు బాగోలేద‌ని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో సెటైర్లు కూడా వ‌చ్చాయి. అసెంబ్లీ భవనం డిజైన్ పరిశ్రమల్లోని పొగ గొట్టాల్లా ఉండడాన్ని అంద‌రూ ఎద్దేవా చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ‘మకి’ని ఎంపిక చేయలేదని ప్రకటించింది.

ఈ సంద‌ర్భంగా సీఆర్‌ డీఏ ఆర్టిటెక్ట్ ప్యాన‌ల్‌ తో స‌మావేశమైన ప్ర‌భుత్వం డిజైన్లు ఇవ్వాల‌ని కోరింది. అయితే, సీఆర్‌ డీఏ ఇచ్చే ప్లాన్‌ ను మ‌కిలో భాగంగా చూస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో సీఆర్‌ డీఏ ప్యాన‌ల్ ప‌క్క‌కు త‌ప్పుకొంది. మ‌రోప‌క్క‌, ఇదే స‌మ‌యంలో మ‌లేసియా కంపెనీ హారీస్ ఇంటర్నేషనల్ కూడా అమ‌రావ‌తి నిర్మాణాల‌కు సంబంధించి డిజైన్లు ఇచ్చింది. ఇవి ప్ర‌భుత్వానికి న‌చ్చాయ‌ని స‌మాచారం. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని విధాలా జ‌పాన్ చెప్పిన ప్ర‌కారం న‌డుచుకుంటున్న నేప‌థ్యంలో నిర్మాణాల డిజైన్‌ పై న‌చ్చ‌లేద‌ని చెబితే ఏమ‌వుతుందోన‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

ఇదే కాకుండా డిజైన్లు ఇచ్చినందుకు(న‌చ్చినా - న‌చ్చ‌క‌పోయినా) 10 కోట్ల రూపాయ‌లు ప్ర‌భుత్వం మ‌కి సంస్థ‌కు స‌మ‌ర్పించాల్సిఉంది. దీంతో ఇటు మ‌కి సంస్థ‌కి ప‌ది కోట్లు ఇచ్చి, అటు మ‌లేసియా సంస్థ‌కు మ‌రో ప‌ది కోట్లు ఇస్తే.. ఇంటా బ‌య‌టా విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. దీంతో డిజైన్ల ఎంపిక ప్ర‌క్రియ అట‌కెక్కింది. ఫ‌లితంగా 2018 నాటికి ఈ నిర్మాణాలు పూర్త‌య్యే ప‌రిస్తితి క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం పుష్కరాల హ‌డావుడిలో ఉన్న ప్ర‌భుత్వం మ‌రో వారం దాకా ఈ విష‌యం పై దృష్టి పెట్టే ప‌రిస్థితి లేదు.