Begin typing your search above and press return to search.

బొమ్మలు చూపి మాయ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Sep 2017 4:16 AM GMT
బొమ్మలు చూపి మాయ చేస్తున్నారు
X
అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఏమిటో.. అచ్చంగా చంద్రబాబునాయుడు ను చూస్తే అర్థమైపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి.. రాజధాని అమరావతిలో అపురూప నిర్మాణాలు వచ్చేయబోతున్నాయంటూ.. ఏవో కొందరు ఆర్కిటెక్ట్ లను పిలవడం - వారు చూపించే బొమ్మలను మీడియా ద్వారా ప్రజలకు చూపించి.. వారి కళ్ల ముందు ఒక అద్భుత ప్రపంచాన్ని మాయతెరలాగా ఆవిష్కరించడం అనేది చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిపోయిందనేదే ప్రజల అభిప్రాయంగా ఉంటోంది. ఒక రకంగా చెప్పాలంటే... ప్రజలు విమర్శలు గుప్పిస్తున్న తరహాలోనే చంద్రబాబునాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా ఉంటోంది.

అమరావతిని అద్భుత రాజధాని నగరంగా తీర్చిదిద్దేస్తాం అనే మాట మాత్రం.. పదేపదే ప్రభుత్వం నుంచి వినిపస్తూ ఉంది. కానీ.. ఏ రకంగా చేస్తారు? ఏం అద్భుతాలు చేస్తారు? ఎప్పటికి చేస్తారు? ఎంత నిధులతో చేస్తారు? ఎలా ఆ నిధులను సమీకరిస్తారు? ఇలాంటి ప్రశ్నలన్నీ.. జవాబు లేకుండానే మిగిలిపోతున్నాయి. బొమ్మలను గీయించే పర్వాన్ని మాత్రం చంద్రబాబానాయుడు చాలా ఘనంగా పూర్తిచేస్తున్నారు.

తాజాగా అమరావతి నగరంలో హైకోర్టు - అసెంబ్లీలకు సంబంధించిన భవనాల డిజైన్లు చంద్రబాబు పరిశీలనకు వచ్చాయి. బొమ్మలు బాగానే ఉంటాయి. కానీ.. ఆచరణలో వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది? అనేది ప్రజల మెదళ్లను తొలుస్తున్న సందేహం. రెండేళ్ల కిందట విజయదశమికి శంకుస్థాపన చేసిన నగరంలో ఇవాళ్టి దాకా ఒక్క నిర్మాణం కూడా రూపుదిద్దుకోలేదు. నిర్మాణాలకు నిధులు లేవు. చంద్రబాబు ఒక వైపు డిజైన్లు చూస్తూ వాటికి ఓకే చెప్పేస్తూ ముద్ర వేసేస్తున్నారు గానీ.. వాటిని నిర్మించడం ఎప్పటికి? అనేదే తేలడం లేదు.

పైగా ప్రజలను మరో సందేహం కూడా పీడిస్తోంది. వచ్చే ఎన్నికల్లోగా ఏవో కొన్ని నిర్మాణాలు సగంలో ఉన్నట్లయినా ఆనవాళ్లు చూపించి.. తనకు ఓట్లు వేయాల్సిందిగా చంద్రబాబు హడావిడి చేస్తారేమోనని.. అలా చేసినట్లయితే.. వెలగపూడి సచివాలయం లాగానే.. నాసిరకం నిర్మాణాలు తయారవుతాయని పలువురు భావిస్తున్నారు. వెలగపూడిలో ఏదో అద్భుతాన్ని సృష్టించేస్తున్నంత బిల్డప్ ఇచ్చి నిర్మించిన సచివాలయాలు - అసెంబ్లీ భవనాలు లీకేజీలతో.. నాసిరకం నిర్మాణ విలువలతో ప్రభుత్వం పరువుపోయేలా తయారైన సంగతి అందరికీ తెలుసు. మరి ప్రపంచానికి వన్నె తెచ్చే రాజధాని చేస్తాం అంటున్న వారు వాటి విషయంలోనూ అలాగే వ్యవహరిస్తారో ఏమో అనే భయాలు ప్రజల్లో కలుగుతున్నాయి.