Begin typing your search above and press return to search.

అమరావతి డిజైన్లు చేస్తే ఫూల్స్ అయినట్టే!

By:  Tupaki Desk   |   15 Sep 2017 1:30 AM GMT
అమరావతి డిజైన్లు చేస్తే ఫూల్స్ అయినట్టే!
X
అమరావతి నగరం కోసం నార్మన్ అండ్ పోస్టర్ సంస్థ తయారుచేసిన తాజా డిజైన్లు కూడా మళ్లీ తిరస్కరణకు గురయ్యాయి. కామెడీ ఏంటంటే.. ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థ చాలా వ్యవధి తీసుకుని పరిశోధన చేసి రూపొందించిన డిజైన్లు కూడా ముఖ్యమంత్రి గారికి నచ్చడం లేదు. తద్వారా ఎంతటి కొమ్ములు తిరిగిన వారైనా సరే.. తన అభిరుచి ముందు బలాదూర్ అని చంద్రబాబునాయుడు చాటుకుంటున్నట్లుగా  కనిపిస్తోంది. అయితే అమరావతిలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. ఇప్పట్లో అనగా మరికొన్ని నెలల పాటూ.. అమరావతి కి సంబంధించిన ఏ డిజైను కూడా ఓకే కాబోదని - డిజైన్లను చేయించడం - ఇది బాలేదు.. అంటూ డిజైన్ చేసిన ప్రఖ్యాత సంస్థల మొహం మీదనే చెప్పేయడం అంతా ఒక స్ట్రాటెజీ ప్రకారం జరుగుతోందని పలువురు భావిస్తున్నారు. ఎవ్వరైనా సరే.. డిజైన్లు తయారు చేయడానికి ఈ దశలో ముందుకు వస్తే గనుక.. వారు ఫూల్స్ అయినట్టేనని.. అవి ఎంత బాగున్నా సరే.. వాటిని చంద్రబాబు ఆమోదించేది జరగదని ప్రజల అభిప్రాయంగా ఉంది.

దీనికి సహేతుకమైన కారణాలు కూడా ఉన్నాయి. డిజైన్ల మీద నెపం పెట్టేస్తే గనుక.. పనులను వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉండదు. డిజైన్లు ఓకే అయి ఉంటే ఎప్పుడో పనులు చేసేసి ఉండేవాళ్లం అటూ రకరకాల బొంకులతోనే కాలం వెళ్లదీసేయవచ్చు. అదే ఒకసారి ఓకే అంటే గనుక.. పనులు చేయాల్సి వస్తుంది. అక్కడ నిర్మాణాల కోసం వచ్చిన నిధులు రూపాయి కూడా లేవు. ఖజానాలో పైసా లేదు. ఈ పరిస్థితుల్లో డిజైన్లు ఓకే అని అభాసు పాలు కావడం కంటె.. డిజైన్లు బాగా లేవనే నెపంతో... వాటిని చేస్తున్న సంస్థల పరువు తీసేస్తే సరిపోతుందని చంద్రబాబు సర్కారు ఈ దారి ఎంచుకున్నట్లు జనం వ్యాఖ్యానిస్తున్నారు.

కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్రం మొత్తం నిధులను భరించాల్సి ఉంది. కానీ అలాంటి పోకడ ఇప్పటిదాకా ఏమాత్రం ముందుకు సాగినట్లు లేదు. ఖాళో చేత్తో మూర వేసినట్లుగా అనే సామెత చందంగా.. ఖజానాలో డబ్బుల్లేకుండానే.. చంద్రబాబునాయుడు డిజైన్ల మీద డిజైన్లు తయారు చేయించేస్తున్నారు. అవేవీ బాగాలేవని తిప్పి కొడుతున్నారు. అందుకే ఇప్పుడు నిపుణుల్లో వినిపిస్తున్న వాదన ఏంటంటే.. ఇంతకంటె కొమ్ములు తిరిగిన గొప్ప ఆర్కిటెక్ట్ సంస్థలు ఏవైనా ఉండొచ్చు గాక.. కానీ వారికి ఉత్సాహం ఉన్నా కూడా ఈ దశలో డిజైన్లు చేస్తే అవి ఓకే అయ్యే అవకాశం లేదని, అనవసరంగా పరువు పోతుందని హెచ్చరిస్తున్నారు.