Begin typing your search above and press return to search.

అనంత ర‌చ్చ‌కు ముగింపు ఎప్పుడు బాబు?

By:  Tupaki Desk   |   22 Dec 2017 6:44 AM GMT
అనంత ర‌చ్చ‌కు ముగింపు ఎప్పుడు బాబు?
X
తెలుగుదేశం పార్టీలోని చిత్ర‌మైన పరిస్థితి ఆ పార్టీ నేత‌లే క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. పైకి గంభీరంగా `టీడీనీ క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పార్టీ` అని ప్ర‌చారం చేసుకుంటూ...`గీత దాటితే...సీనియ‌ర్లు అయినా చూడ‌కుండా వేటేస్తాం` అని హెచ్చ‌రిక‌లు చేస్తున్న‌ప్ప‌టికీ...అవ‌న్నీ పార్టీ నేత‌లు లైట్ తీసుకుంటున్నార‌ని...క్షేత్ర‌స్థాయిలో గ్రూపు రాజ‌కీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీకి కంచుకోట లాంటి అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య లుకలుకలు రోజురోజుకూ పెరుగుతున్నాయనేది కొంద‌రు తెలుగుదేశం నాయ‌కుల ఆవేద‌న‌. పార్టీ పెద్ద‌ల ప‌ట్ల అస‌హ‌నం కూడా! పరస్పరం ఆరోపణలు - ప్రత్యారోపణలకు దిగుతున్నారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై అనంతపురం నగర మేయర్‌ ఎం.స్వరూప బుధవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం... దానికి ప్రతిగా జేసీ మద్దతుదారులైన టీడీపీ కార్పొరేటర్లు కొంతమంది గురువారం మేయర్‌ పై ప్రతి విమర్శలు చేశారు. ఈ ప‌రిణామంతో టీడీపీని చూసు ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని అంటున్నారు. దీనికంతటికి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి - ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య ఉన్న విభేదాలే కారణమని తెలిసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీ - ఎమ్మెల్యే మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అనంతపురం నగరంలోని తిలక్‌ రోడ్డు - గాంధీ బజారుల విస్తరణ చేపట్టాలని ఎంపీ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇది అవసరం లేదన్నది ఎమ్మెల్యే అభిప్రాయం. ఈ విస్తరణ విషయంలో ఇద్దరి మధ్య వివాదం సాగుతోంది. దీనిని సద్దుమణిగించేందుకు ముఖ్యమంత్రి కలుగజేసుకుని ప్రభుత్వపరంగా ఒక కమిటీని వేసినా ఇంతవరకూ ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి కుటుంబం టీడీపీలో చేరింది. దీని వెనుక ఎంపీ దివాకర్‌ రెడ్డి ఉన్నట్లు ప్ర‌చారం జ‌రిగింది.

మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించి తనకు అడ్డుకట్ట వేస్తారనే అభిప్రాయం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే గురునాథరెడ్డిని పార్టీలోకి తీసుకోవడాన్ని ప్రభాకర్‌ చౌదరి బాహాటంగానే వ్యతిరేకించారు. అధిష్టానాన్ని ఒప్పించి వారు పార్టీలో చేరే విధంగా ఎంపీ మంతనాలు చేశారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఈ క్రమంలోనే అనంతపురం నగరాభివృద్ధిని కొంతమంది అడ్డుకుంటున్నారని ఇటీవల అనంతపురం వచ్చినప్పుడు ఎంపీ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా నగర మేయర్‌ ఎప్పుడూ లేనివిధంగా జేసీ దివాకర్‌ రెడ్డిపై ప్రతి విమర్శలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భీష్ముడిలా సహకరిస్తారంటే శకునిలా అడ్డుపడుతున్నారని మేయర్‌ స్వరూప వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఉన్నారని దివాకర్‌ రెడ్డి అనుయాయులు వాపోతున్నారు. దీనికి ప్రతిగా దివాకర్‌ రెడ్డి మద్దతుదారులైన కార్పొరేటర్లు కొంతమంది మేయర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతమంది దుశ్శాసన - ద్రుతరాష్ట్రుల చేతిలో పడి ద్రౌపది కావద్దంటూ చేసిన హితవు చర్చనీయాంశమవుతోంది. ఈ విధంగా ఇరు గ్రూపుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

స్థూలంగా అనంత‌పురం అధికార టీడీపీ అంటే రెండు గ్రూపులు...మూడు వివాదాలు..ఆరు ఆరోప‌ణ‌లు అన్న‌ట్లుగా మారిపోయింద‌ని స్థానిక నేత‌లు బ‌హిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇంత జ‌రుగుతున్నా పార్టీ పెద్ద‌లు సీరియ‌స్‌ గా స్పందించక‌పోవ‌డం త‌మ‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని కొంద‌రు టీడీపీ నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.