Begin typing your search above and press return to search.

బాబుకు ఇంకో త‌మ్ముడు బీపీ పెంచేస్తున్నాడు

By:  Tupaki Desk   |   11 July 2017 10:38 AM GMT
బాబుకు ఇంకో త‌మ్ముడు బీపీ పెంచేస్తున్నాడు
X
తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ లుక‌లుక‌ల ఆ పార్టీ ఇమేజ్‌ పై ప్ర‌భావం చూపిస్తోంది. ఒక జిల్లాల్లో నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త‌కు ప్ర‌య‌త్నిస్తుంటే...మ‌రో జిల్లాలో నేత‌ల మ‌ధ్య విబేధాలు పొడ‌చూపుతున్నాయి. ఇవ‌న్నీ పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు త‌ల‌నొప్పిగా మారుతున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ రాజీనామా వ్యవహారం మళ్లీ సస్పెన్షన్ దారితీసింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల స‌మ‌యంలో కుదిరిన‌ ఒప్పందం ప్రకారం చమన్‌ ను రెండున్నరేళ్లు, మిగతా కాలం గుమ్మఘట్ట జడ్పీటీసీ నాగరాజును జడ్పీ చైర్మన్‌ గా కొనసాగించాలని నిర్ణయించారు. అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా కమిటీ, ముఖ్య నేతలు ఈమేరకు నిర్ణయించారు. ఆమేరకు ఈ ఏడాది జనవరి 5 నాటికి రెండున్నరేళ్ల గడువు ముగిసింది. తదుపరి నాగరాజుకు జెడ్పీ చైర్మన్‌ గా అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే మూడు నెలలు గడువు ఇవ్వాలని చమన్ కోరడం, అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో కొనసాగించేందుకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సుముఖత వ్యక్తం చేశారు.

అనంతరం చ‌మ‌న్ రాజీనామా విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో గత నెల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో చమన్ రాజీనామా చర్చకు వచ్చింది. అనివార్య పరిస్థితుల కారణంగా రాజీనామా చేయలేకపోయానని, జూలై 15 నాటికి రాజీనామా చేస్తానని చమన్ గడువు కోరారు. ఈ ప్ర‌కారం చమన్ రాజీనామాకు మరో 5 రోజులు మాత్రమే గడువు ఉంది. కాగా చమన్ రాజీనామాను ముస్లిం మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఆయనను రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించడంపై కినుక వహించారు. ముస్లిం మైనార్టీలో కొన్ని వర్గాలు ఆయనను కొనసాగించాలంటూ గళం వినిపిస్తున్నాయి. గత మూడు - నాలుగు రోజుల నుంచి అనంతపురంతోపాటు రాయదుర్గం, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో కొన్ని వర్గాల ముస్లిం మైనార్టీలు సమావేశాలు నిర్వహించి చమన్‌ కు మద్దతు తెలిపాయి. ఆయన రాజీనామా చేయించాలన్న నిర్ణయాన్ని అధిష్టానం అమలుచేయరాదని కోరుతున్నారు. ఐదారు నెలల నుంచి మిన్నకుండిన వారు ఇపుడు గడువు దగ్గర పడుతున్న తరుణంలో తమ వాణిని వినిపించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక ఎవరున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముస్లింలు స్వచ్ఛందంగా వస్తున్నారా? లేక జిల్లాలో పరోక్షంగా ఎవరైనా సీనియర్ - ముఖ్య నేతలు సలహా ఇచ్చి ఈమేరకు చేయిస్తున్నారా? లేక చమన్ తెర వెనుక ఉంటూ తనకు అనుకూలంగా ఉన్న వారి మద్దతు కూడగట్టి అధిష్టానానికి జిల్లాలో తన ప్రాధాన్యతను తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనే సందేహాలు జిల్లా రాజీకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అయితే అనంత‌పురంలోని ముస్లిం నేత‌ల వాద‌న మ‌రో విధంగా ఉంది. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఉన్నత పదవుల్లో ఎవరూ లేరని, కనుక చమన్‌ ను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు - తదితర జిల్లాల్లో కూడా ఒప్పందాలు ఉన్నా వారిపై రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేయడం లేదని ఉదహరిస్తున్నారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఇంకో న్యాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీన్నిబట్టి చమన్ తనదైన శైలిలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ముస్లిం మైనార్టీలకు పెద్ద పీట వేయాలన్న ఉద్దేశంతోనే చమన్‌ ను కొనసాగించాలని తాము కోరుతున్నామంటూ ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న వర్గాలు పేర్కొంటుండటం విశేషం. ఈ పరిస్థితుల్లో ఈ నెల 15న చమన్ రాజీనామా చేస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ రాజీనామా చేయకపోతే జిల్లా రాజకీయాల్లో బలవంతులదే రాజ్యం అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న ఆందోళన జిల్లా పార్టీలో నెలకొంది. ఇప్పటికే ఆలస్యమైందని, అధిష్టానం ఆదేశాలను శిరసావహించి చమన్ రాజీనామా చేయాల్సి ఉందని పార్టీ నేతలు అంటున్నారు. చమన్ రాజీనామా చేయకుంటే సీఎం వివక్ష చూపుతున్నారని బిసిలు, జిల్లా ప్రజలు భావించే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాజీనామాపై చ‌మ‌న్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కుంటారు అనే ఆస‌క్తి విప‌క్షాల్లోనే కాదు టీడీపీలోనూ ఉండ‌టం గ‌మ‌నార్హం.