Begin typing your search above and press return to search.

పెద్ద త‌ల‌నొప్పి పోయింద‌న్న చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   10 Oct 2015 4:47 PM GMT
పెద్ద త‌ల‌నొప్పి పోయింద‌న్న చంద్ర‌బాబు
X
ఏపీ మంత్రివర్గ సమావేశం అనంత‌రం సీఎం చంద్రబాబు నాయుడు ఆ వివ‌రాల‌ను స్వ‌యంగా మీడియాకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేబినెట్ భేటీలో చ‌ర్చించిన పలు అంశాల‌తో పాటు మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించారు. పోలవరం ప్రాజెక్టుపై క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. పోల‌వ‌రం ముంపు మండలాలను ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కలపడం ‌తో అడ్డంకులు తొలగిపోయాయన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అయితే... కాంగ్రెస్‌ పార్టీ వైఖరి వల్లనే పోలవరం ప్రాజెక్టు చేపట్టడంలో కాలయాపన జరిగిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు గుత్తేదార్లకు రూ 241.822 కోట్లు చెల్లించారని చెప్పారు. ఇరిగేషన్‌, హైడ్రోపవర్‌, తాగునీటికోసం పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడనుందని తెలిపారు. భూసేకరణకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని, తాము అధికారంలోకి రాగానే స్టే వెకెట్‌ చేయించామన్నారు. భూములు కొల్పోయిన వారికి నష్టపరిహారం అందించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు కేంద్రానికి పంపుతామని చంద్రబాబు వివరించారు.

రాష్ట్రంలోని 5 కోట్ల మంది జనాభా కీలకమైన రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఏపీ సిఎం చంద్రబాబు కోరారు. దేశంలోనే పవిత్రమైన రోజు అయిన విజయదశమినాడు శంకు స్థాపన చేస్తున్నామ‌ని తెలిపారు. తక్కువ ఖర్చుతో రాజధాని శంకుస్థాపనను ఘనంగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి పూజా ఫలాలు శంకుస్థాపనలో ఉండాలన్నారు. ప్రతి ఊళ్లో పవిత్ర జలాలను సేకరించాలని, దసరా పండుగను చేసుకున్నట్లే ఈ శంకుస్థాపన జరగాలన్నారు. 13న నవరాత్రులు ప్రారంభమయ్యే రోజుననే ప్రజలు పుట్ట మట్టిని సేకరించాలన్నారు. మట్టి సేకరించడం, ప్రతి ఊళ్లో జలాలను తీసుకుని రావడం, అమరావతి సంకల్పం రాయడం ప్రజలకు పిలుపుగా ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 19న సాయంత్రానికి వాహనాల్లో వీటిని తరలిస్తారన్నారు. రాజధానిలో అడ్మినిస్ట్రేట్‌ బ్లాక్‌ కట్టుకోవాలని, దానితోపాటు వాణిజ్యాభివృద్ధి జరగాలన్నారు. శంకుస్థాపనకు వ్యాపారులను,ఎన్‌ఆర్‌ఐలను భాగస్వామ్యం చేయనున్నామ‌ని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, పార్టీల నేతలను ఆహ్వానించనున్నామని తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు రావడానికి అంగీకరించిన ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జపాన్‌, సింగపూర్‌ మంత్రులు కూడా విచ్చేస్తున్నారని తెలిపారు.సింగపూర్‌లో సముద్రాన్ని పూడ్చి 170 కిమీ భూభాగాన్ని పెంచుకున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.

రెండు నదులను అనుసంధానం చేయగలిగామన్నారు. కృష్ణపట్నం పోర్టు రైల్వే లేన్‌కోసం 9 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాజమండ్రి పేరును ప్రజల అభీష్టం మేరకే మార్చామని శంకుస్థాపన కార్యక్రమాన్ని తెలిపారు. విశాఖలో 30 లక్షల మందికి తాగునీరు అందించే అవకాశముందన్నారు.