Begin typing your search above and press return to search.

అసలైన చోట ఆ ఊసెత్తని చంద్రబాబు!

By:  Tupaki Desk   |   21 Aug 2016 5:18 PM GMT
అసలైన చోట ఆ ఊసెత్తని చంద్రబాబు!
X
కేంద్రప్రభుత్వం కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌ కు 2000 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ఇది ముష్టి విదిలించినట్లుగా ఉన్నదని అందరూ అన్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు కూడా చెప్పారు. కేంద్రం అనుకున్నంతగా సాయం చేయడం లేదని ఆయన ఎక్కడ వేదిక కనిపిస్తే అక్కడ తన ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కృష్ణా హారతి వద్ద జనం కనిపిస్తే అక్కడ కూడా అదే సంగతి చెప్పారు. అయితే.. అసలైన వేదిక ఏపీ కేబినెట్‌ భేటీలో మాత్రం అసలు కేంద్ర సాయం నామమాత్రంగా కూడా పట్టించుకోకపోవడం.. ఇప్పుడు అనేక విమర్శలకు గురవుతోంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి.. అత్యున్నత స్థాయి విధాన నిర్ణయాలు తీసుకునేది కేబినెట్‌ భేటీనే. మరి అంత కీలక సమావేశంలో కేంద్ర సాయంలో జరుగుతున్న వంచన గురించి ఎజెండాలో పెట్టి మాట్లాడకపోవడం.. మరొక కొత్త నాటకం అని సాక్షాత్తూ కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు ఏమీ ఉపయోగంలేని మీటింగుల్లో కేంద్ర సాయం గురించి విమర్శలు చేయడం ఉపయోగం ఉండదని, అదే కేబినెట్‌ భేటీలో ఈ అంశాన్ని చర్చించి, కేంద్ర సాయం పట్ల అసంతృప్తిని వ్యక్తంచేస్తూ ఓ తీర్మానం రూపొందించి అందరు మంత్రుల సంతకాలతో ఢిల్లీకి పంపి ఉంటే దాని తీవ్రత ఒక రేంజిలో ఉండేదని పలువురు భావిస్తున్నారు.

రాష్ట్రానికి సాయం రాబట్టే విషయంలో.. చంద్రబాబునాయుడు ఏమైనా చర్యలు తీసుకోదలచుకుంటే గనుక.. వాటి వల్ల ఎంతో కొంత ఫలితం దక్కేలా ఉండాలి. ఆ చర్యలు కేంద్రంలో కదలిక తీసుకురావాలి. అలాంటి దేమీ లేకుండా.. ఉత్తినే రోడ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏంటి లాభం. శనివారం నాటి కేబినెట్‌ భేటీలో చంద్రబాబు కనీసం కేంద్ర సాయం అంశాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదట. ఈ భేటీలో కనుక చర్చకు పెట్టి, అసంతృప్తి తీర్మానం చేసి ఉంటే.. భాజపా మంత్రుల సంతకాలు కూడా అనివార్యంగా ఉంటాయి గనుక.. కేంద్రం మీద అది కొరడా దెబ్బలాగా పనిచేసి ఉండేదని.. మంచి అవకాశాన్ని మిస్‌ చేసిన చంద్రబాబునాయుడు, జనం ముందు మాత్రం కేంద్రం గురించి ఉత్తుత్తి ఆవేశం చూపిస్తుంటారని విమర్శలు వస్తున్నాయి.