Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకు బాబు సరైన నిర్ణయం తీసుకున్నారో!

By:  Tupaki Desk   |   3 Jan 2016 6:48 AM GMT
ఎన్నాళ్లకు బాబు సరైన నిర్ణయం తీసుకున్నారో!
X
ముందు వెనుకా చూసుకోకుండా పనులు చేసేయటం.. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసేయటం.. ఆ తర్వాత ఆ ఖర్చు చేసిన సొమ్ము కారణంగా ఎలాంటి ప్రయోజనం కలగకుండా పోవటం ఈ మధ్య కాలంలో ఏపీ అదికారపక్షానికి ఒక అలవాటుగా మారింది. దీనికి అందరికి అర్థమయ్యే ఉదాహరణ చెప్పాలంటే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో తాను విధులు నిర్వర్తించాల్సిన సీఎం ఛాంబర్ ను ఆధునీకీకరించాలని భావించారు. అంతే.. రూ.10కోట్ల అంచనాతో మొదలు పెట్టి రూ.15కోట్లకు పై చిల్లరతోపూర్తి చేశారు.

విభజన కారణంగా ఓపక్క నిధుల కటకట ఎదుర్కొంటుంటే.. మరోవైపు అదేమీ పట్టించుకోకుండా ఎడాపెడా తన ఛాంబర్ కోసం ఖర్చు చేయటంపై పలువురు విమర్శలు చేశారు. అయినా.. అవేమీ పట్టించుకోలేదు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. ఏదో ఒకరోజు వెళ్లిపోయే ఆఫీసు కోసం అన్నేసి డబ్బులు తగలబెట్టటంపై ఏపీ ప్రజల్లో అగ్రహం వ్యక్తమైంది. కానీ.. చంద్రబాబు అలాంటి విషయాల్ని పెద్దగా పట్టించుకోరన్న సంగతి తెలిసిందే.

ఇలా.. తనకు తోచిన రీతిలో ఖర్చులు చేయటంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ఈ తరహాలో మరో నిర్ణయం తీసుకున్నారు. అమరావతి టౌన్ షిప్ పేరిట మంగళగిరి వద్ద రూ.300కోట్లతో తాత్కలిక సచివాలయాన్ని నిర్మించాలని.. అందుకు రూ.300కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. యుద్ధ ప్రాతిపదికన ఆర్నెల్ల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని.. హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల అవసరాలకు ఈ భవనాన్ని వినియోగించాలని భావించారు.

ఏపీ సచివాలయ ఉద్యోగుల కోసం రూ.300కోట్లు పెట్టి నిర్మించే భవనం. శాశ్విత కట్టడంగా ఉండాలే కానీ.. తాత్కలికం అయితే దాని వల్ల నష్టమే తప్పించి ఎలాంటి లాభం ఉండదు. ఒకసారి ఒక అవసరానికి తయారు చేసిన కట్టడాల కారణంగా.. భవిష్యత్తులో ఎంతమేర ఉపయోగపడతాయన్నది సందేహం. ఇలాంటి సమయంలో.. కోర్ క్యాపిటల్ లోనే భవనాలు కడితే సరిపోతుంది. కాకుంటే.. నాలుగు రోజులు ఆలస్యం అవుతుంది. ఈ చిన్న విషయాన్ని ఏపీ సర్కారుకు పట్టలేదు. తాత్కలిక సచివాలయం కోసం ఇన్నేసి వందల కోట్లు ఖర్చు చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఆసక్తికరంగా.. ఈ దఫా చంద్రబాబు విమర్శలపై స్పందించినట్లు చెబుతున్నారు. తాత్కలిక సచివాలయ నిర్మాణంపై వెనక్కి తగ్గిందన్న మాట వినిపిస్తోంది. అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోనే సచివాలయ భవనాన్ని నిర్మించాలన్న ఆలోచనకు బాబు సర్కారు వచ్చిందని చెబుతున్నారు. ఇన్నాళ్లు అనవసరమైన ఖర్చు విషయంలో.. సరైన సమయంలో బాబు సర్కారు చక్కటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు.