Begin typing your search above and press return to search.

ఉద్యోగుల విషయంలో మెత్తబడిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   15 Jun 2016 11:30 AM GMT
ఉద్యోగుల విషయంలో మెత్తబడిన చంద్రబాబు
X
అమరావతికి తరలి వచ్చే విషయంలో ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు కాస్త సడలింపు ఇచ్చారు. 27వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులంతా అమరావతి ప్రాంతానికి రావాలని, గుంటూరు - విజయవాడల్లో ఆఫీసులు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే పాలన సాగించాలని గట్టిగా చెబుతూ వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు తాజాగా కాస్త వెసులుబాటు ఇచ్చారు. 27 నాటికి వీలైనన్ని శాఖలు అమరావతికి వస్తాయని, వీలైనంత మందిని రప్పిస్తామని అన్నారు. ఇంతవరకు ‘‘తప్పకుండా రావాల్సిందే’’ అంటున్న చంద్రబాబు ఇప్పుడు వీలైనంత మంది అనడంతో ఉద్యోగవర్గాలు కాస్త ఉపశమనం పొందాయి. 22వ తేదీ వరకు ఎన్ని శాఖలు తరలివస్తాయన్న విషయంపై స్పష్టత వస్తుందని, ఆ శాఖల్లో కూడా కొందరు హైదరాబాద్ లో ఉంటారని చంద్రబాబు తాజాగా చెప్పారు. భవిష్యత్తులో మంత్రులూ - కార్యదర్శులూ ఒకే చోట ఉంటారని, అందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ సుపరిపాలన అందించడమే తన లక్ష్యమని, ప్రతి ఒక్కరిలో అభివృద్ధి తపన పెరగాలని చంద్రబాబు అన్నారు.

అయితే.. తాత్కాలిక రాజధాని పనులు కొంతమేరకు మిగిలి ఉండడం వల్ల చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు అందరూ తరలివస్తే ఇబ్బందేనన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ వెసులుబాటు ఇచ్చారని తెలుస్తోంది. వెలగపూడి ప్రాంతంలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం పనులు జరుగుతున్న తీరుపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని బట్టి ఇలాంటి అంచనాలు వెలువడుతున్నాయి.

పనుల తీరును పరిశీలించిన చంద్రబాబు.. తాను ఇటీవల వచ్చినప్పుడు నిర్మాణం ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడ్డ ఆయన, ఉన్నతాధికారులు దగ్గరుండి పనులను వేగవంతం చేయాలని సూచించారు. విజయవాడ రియల్ ఎస్టేట్ సంఘం నుంచి పెద్దఎత్తున భవన నిర్మాణ కార్మికులు వచ్చినందున, వారందరినీ ఉపయోగించుకోవాలని చెబుతూ పది రోజుల్లో పూర్తి స్థాయిలో భవనాలు సిద్ధం కావాలని ఆదేశించారు.