Begin typing your search above and press return to search.

అంగన్ వాడీ ఆడపడుచులకు చంద్రన్న అభయం

By:  Tupaki Desk   |   18 Dec 2015 10:15 AM GMT
అంగన్ వాడీ ఆడపడుచులకు చంద్రన్న అభయం
X
రాష్ట్రంలోని మహిళలందరికీ అన్నల ఉంటానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీలో కొంత ఆలస్యం వల్ల.. ఇసుక రీచులను మహిళలకు కేటాయించినా నేతల జోక్యాన్ని నివారించలేక కొంత ఇంతవరకు ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, ఆయన తాజా నిర్ణయం రాష్ట్రంలోని ఆడపడుచుల మనసు దోచుకుంది. వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న అంగన్ వాడీ మహిళలపై లాఠీ ఛార్జీ చేయొద్దని... వారి ఒంటిపై ఒక్క దెబ్బ కూడా పడడానికి వీల్లేదని ఆయన ఆదేశాలు జారీచేశారు.

విజయవాడలో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో వారి ఆందోళనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అంగన్‌ వాడీలపై లాఠీఛార్జీ చేయొద్దని పోలీసులను చంద్రబాబు ఆదేశించారు.

అంతేకాదు.. అంగన్ వాడీ హెల్పర్ల వేతనాలను పెంచుతున్నట్లు ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అంగన్ వాడీ వర్కర్ల వేతనాలను 4,200 నుంచి 7 వేల రూపాయలకు పెంచుతున్నట్లు చంద్రబాబు సభలో ప్రకటించారు. అంగన్ వాడీ వర్కర్లు పేదల పిల్లల కోసం పని చేస్తున్నారని... వచ్చే బడ్జెట్ నుంచి అంగన్ వాడీ వర్కర్ లకు పెంచిన జీతాలు అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

కాగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళ నెలకొంది. సభ నుంచి సస్పెన్షన్‌ కు గురైన వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వెళ్లేందుకు యత్నించగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు ఎమ్మెల్యేలు గేటు దూకి లోనికి ప్రవేశించి.. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.