Begin typing your search above and press return to search.

బంద్‌ కు ఒప్పుకోవు..హోదా ఎలా తెస్తావు?

By:  Tupaki Desk   |   16 April 2018 4:41 AM GMT
బంద్‌ కు ఒప్పుకోవు..హోదా ఎలా తెస్తావు?
X
ఆంధ్రాకు.. తెలంగాణ‌కు తేడా ఏంది? కొంత‌మంది త‌ర‌చూ ఈ ప్ర‌శ్న వేస్తుంటారు. ఈ ప్ర‌శ్న‌కు ఒక్కొక్క‌రు ఒక్కోలా స‌మాధానం చెబుతారు. అయితే.. ఇలా చెప్పే స‌మాధానాల్లో కొంద‌రు మాత్రం వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఒక్క‌మాట‌లో విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చెబుతారు. ఆంధ్రా వాళ్లు నీది.. నాది అంటారు. తెలంగాణ వాళ్లు మాత్రం మ‌న‌ది అంటారు. అలా అని అన్ని విష‌యాల్లో కాదు సుమా. కీల‌క‌మైన స‌మ‌స్య‌ల విష‌యానికి వ‌చ్చిన‌ప్పుడు.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లే త‌ప్పించి వ్య‌క్తిగ‌త ఎజెండాల్ని ప‌క్క‌న పెడతారు. కానీ.. బాబు లాంటి స‌మూహం ఏపీలో ఉండ‌టంతో న్యాయ‌మైన కోర్కెల్ని సైతం ఉద్య‌మించి సాధించుకోలేని దుస్థితి.

తెలంగాణ ఉద్య‌మం సంగ‌తే చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంతిమంగా మైలేజీ త‌న‌కే ద‌క్కాల‌నుకునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం.. త‌న‌కు మించిన మైలేజీ ఎవ‌రికైనా వ‌చ్చినా చూసిచూన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించేవారు. ఎందుకంటే.. తాను న‌మ్మిన తెలంగాణ అంశం ముందుకు క‌దులుతుంటే.. మైలేజీని ఏదో ర‌కంగా త‌న వైపున‌కు తిప్పుకోగ‌ల‌న‌న్న న‌మ్మ‌కం ఆయ‌న‌లో క‌నిపించేది. ఒక ఉద్య‌మ‌నేత‌కు.. రాజ‌కీయవేత్త‌కు ఉండాల్సిన ఈ స‌హ‌జ ల‌క్ష‌ణం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొద‌లుకొని చాలామందిలో క‌నిపించ‌దు.

ఎక్క‌డి వ‌ర‌కో ఎందుకు..? ఈ రోజు ఏపీ బంద్ సంగ‌తే చూడండి. ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ మొద‌లు అన్ని రాజ‌కీయ పార్టీలు హోదా సాధ‌న అంశంపై బంద్ కు పిలుపునిచ్చాయి. హోదా సాధ‌నే త‌మ ల‌క్ష్యంగా క‌బుర్లు చెప్పే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం బంద్‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌.. హోదా ఇవ్వ‌టానికి సుతారం ఇష్ట‌ప‌డ‌ని బీజేపీ కూడా ఆంధ్రా బంద్ కు దూరంగా ఉండ‌నుంది.

ఐదు కోట్ల ఆంధ్రుల కోసం హోదా సాధ‌నే ముఖ్య‌మ‌నుకున్న‌ప్పుడు.. ఎవ‌రు బంద్ కు పిలుపునిస్తే మాత్రం దానికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌టానికి ఎందుకంత ఇబ్బంది? అధికార‌ప‌క్షంగా ఉండి బంద్ ల‌ను ప్రోత్స‌హిస్తామా? అన్న మాట‌నే చెబితే.. మ‌రి.. ముఖ్య‌మంత్రిగా ఉండి నిర‌స‌న‌కు రంగం సిద్ధం చేసుకోవ‌టం లేదా? దేశంలోని స‌మ‌స్య‌ల్ని ఇట్టే ప‌రిష్క‌రించే స‌త్తా ఉన్న పెద్ద‌మ‌నిషి మోడీ సైతం నిర‌స‌న చేశారు క‌దా? అలాంట‌ప్పుడు హోదా సాధ‌నే ముఖ్య‌మ‌నుకున్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి సైతం బంద్ కు ఓకే చెబితే పోయేదేమిటో అస్స‌లు అర్థం కాదు.

తాజాగా ఏపీ బంద్ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దూరంగా ఉంటే.. అందుకు భిన్నంగా విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం బంద్ కు త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. త‌న పాద‌యాత్ర‌ను సైతం ఒక రోజు ప‌క్క‌న పెట్టి సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు. బంద్ చేస్తున్న‌ప్పుడు మైలేజీ మొత్తం త‌న‌కే సొంతం కావాల‌న్న అత్యాశే జ‌గ‌న్ కు ఉంటే.. మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించే వారు క‌దా.

వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కంటే కూడా కోట్లాది ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మ‌న్న విష‌యాన్ని అధినేత‌లు మ‌ర్చిపోకూడ‌దు. ఆ విష‌యంలో బాబు కంటే జ‌గ‌న్ చాలా బెట‌ర్ అని చెప్పాలి.

ఏపీ బంద్ విష‌యంలో బాబు వ్యాఖ్య‌లు చూస్తే.. ఆయ‌న తీరు ఇట్టే అర్థ‌మైపోతుంది. బంద్ కు త‌మ పార్టీ దూరంగా ఉంటుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. బంద్ నిర‌స‌న‌ల్లో పాల్గొంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ నోటీసులు ఇవ్వ‌టం దేనికి నిద‌ర్శ‌న‌మో అర్థం కాదు. హోదా సాధ‌న బాబు చెప్పిన మాటలంత ఈజీగా రాదు. దానికి పెద్ద ఎత్తున సంఘ‌ర్ష‌ణ చాలా అవ‌స‌రం.

అలాంట‌ప్పుడు ద్వంద ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తే హోదా వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. ఆ విష‌యాన్ని బాబు ఎందుకు అర్థం చేసుకోలేక‌పోతున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌భుత్వ‌మే బంద్ ను ప్రోత్స‌హిస్తుంద‌న్న చెడ్డ పేరు రాకూడ‌ద‌న్న‌దే బాబు ఉద్దేశం అయితే.. బంద్ కు నైతిక మ‌ద్ద‌తు ఇవ్వ‌టం.. విప‌క్షాలు కోరిన‌ట్లుగా బంద్ కు సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తే జ‌రిగే న‌ష్ట‌మేమీ ఉండ‌దు. కానీ.. హోదాకు సంబంధించి ఏ నిర‌స‌న అయినా త‌మ నేతృత్వంలోనే జ‌ర‌గాల‌ని.. దాని మైలేజీ మొత్తం త‌మ‌కే సొంతం కావాల‌న్న అత్యాశ బాబులో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. వాస్త‌వానికి బాబు త‌ర‌హా బిహేవియ‌రే ఆంధ్రుల‌కు శాపంగా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.