Begin typing your search above and press return to search.

పవన్ తో పోయేదాన్ని జగన్ వరకూ తెచ్చుకున్నారే!

By:  Tupaki Desk   |   20 Oct 2016 5:20 AM GMT
పవన్ తో పోయేదాన్ని జగన్ వరకూ తెచ్చుకున్నారే!
X
కోరి తలనొప్పులు తెచ్చుకోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి. ఓపక్క న్యాయసమ్మతంగా.. ధర్మబద్ధంగా ఒక అంశం తెరపైకి వచ్చినప్పుడు ఒత్తిడికి గురి కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థానే.. అందుకు భిన్నమైన నిర్ణయాలు తీసుకోవటం.. దానికి ప్రతిగా ప్రజాగ్రహం షురూ అయ్యే దుస్థితి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా మెగా అక్వాఫుడ్ పార్క్ వివాదం దాదాపు ఇలాంటిదే. పుడ్ పార్క్ ను అడ్డుకోవటం తమ ఉద్దేశం కాదని.. కాకుంటే.. ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే విషయంలో అనుసరిస్తున్న వైనంపై తమ వ్యతిరేకతను అక్కడి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏడాదిగా పోరాటం జరిగినా పెద్దగా చర్చకు రాని ఈ ఇష్యూ... పవన్ కల్యాణ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో.. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి సుపరిచితంగా మారిపోయింది.

ఫుడ్ పార్క్ విషయంలో ప్రభుత్వం పట్టుదలకు పోకుండా.. బాధితులు తెర మీదకు తెస్తున్న న్యాయమైన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తాను ఆశిస్తున్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అక్వాఫుడ్ పార్క్ ఇష్యూ మీద బాధితులు పలువురు శనివారం పవన్ ను కలిసి.. తమ గోడు వెళ్ల‌బోసుకున్న బాధితుల మాటలకు ప్రభావితమైన పవన్.. వారి వాదనతో కన్విన్స్ అయి ఈ ఇష్యూను తాను టేకప్ చేస్తానని చెప్పటమే కాదు.. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూ మీద తన అభిప్రాయం చెప్పేయటమే కాదు.. రాష్ట్ర సర్కారు నుంచి తానేం కోరుకుంటున్న విషయాన్ని సూటిగా చెప్పేశారు. దీనికి ప్రతిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయి.. రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. కొన్ని నిర్ణయాలు వెల్లడించారు. ఫుడ్ పార్క్ ను తరలించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాకుంటే.. బాధితులు ఆరోపించినట్లుగా ఫుడ్ పార్క్ కారణంగా విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా సముద్రంలోకి పైప్ లైన్ వేయాలన్న నిర్ణయాన్ని ఏపీ సర్కారు వెల్లడించింది.

ప్రభుత్వ స్పందన ఇలా ఉన్న నేపథ్యంలో ఏపీ విపక్ష నేత జగన్ రియాక్ట్ అవుతూ.. ఫుడ్ పార్క్ కు తాను వెళ్లి.. బాధితుల బాధల్ని స్వయంగా తెలుసుకోనున్నట్లు వెల్లడించారు. జగన్ పర్యటనకు ముందే ఈ ఇష్యూను క్లోజ్ చేసే అవకాశం ఉన్నా.. బాబు పెద్దగా రియాక్ట్ కాలేదని చెప్పాలి. నాడు పవన్ ఏదైతే హెచ్చరించారో.. దాదాపు అలాంటి విషయాన్ని తన తాజా పర్యటనలో వెల్లడించిన జగన్.. ఏపీ సర్కారుకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టారని చెప్పాలి. పవన్ ఎప్పుడైతే ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యారో.. ఆయన తెర మీదకు తెచ్చిన విషయాలపై ప్రభుత్వం కానీ స్పందించి ఉంటే ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోకపోవటం.. తాజాగా జగన్ పర్యటించి.. పలు అంశాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా ఏపీ సర్కారుకు డ్యామేజ్ జరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

అదెలానంటే.. ఫుడ్ పార్క్ కారణంగా వచ్చే కాలుష్య తీవ్రతను తాజాగా జగన్ తనదైన శైలిలో చెప్పారు. ఆయన మాటల్లోని కొన్ని వివరాలు చూస్తే.. ఎవరికైనా నిజమనిపించక మానదు. కాలుష్య నియంత్రణ చట్టం సెక్షన్ 8 ప్రకారం సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆరంజ్ కేటగిరిలో ఉందని..ఇది కాలుష్య కారకమని తెలీదా?అని ప్రశ్నించిన జగన్.. ఈ ఫ్యాక్టరీలో రోజుకు మూడు వేల టన్నుల రొయ్యలు.. చేపలు శుద్ధి చేస్తారని.. ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు.

అన్నింటికంటే కీలకమైన మరో పాయింట్ ను జగన్ తెర మీదకు తీసుకొచ్చారు. ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్న యజమానులకు పది కిలోమీటర్ల దూరంలోని సముద్రతీరంలో 350 ఎకరాలు ఉన్నట్లుగా జగన్ వెల్లడించారు. వాటిల్లో కొంత భూమిని ఫ్యాక్టరీకి కేటాయిస్తే.. సముద్రతీరం కావటంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని.. పైగా ఇప్పుడున్న ప్రాంతం నుంచి సముద్రానికి పైపులైన్ వేసే ఖర్చు తప్పుతుంది కదా అని వేసిన ప్రశ్నలో నిజం ఉందన్న భావన కలగటం ఖాయం. పరిశ్రమలు రాకూడదని తాను అనుకోవటం లేదని.. కాకుంటే పచ్చటి పొలాల మధ్య.. గ్రామాల మధ్య ఇలాంటి ఫ్యాక్టరీలు పెడితే కాలుష్యంతో తీవ్ర పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నారు. ఇప్పటికే రూ.15 నుంచి రూ.20 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని.. కానీ.. అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లను తీసుకెళ్లి మరోచోట పెట్టినా పెద్ద నష్టం వాటిల్లదంటూ జగన్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని చెప్పక తప్పదు. ఇదంతా చూసినప్పుడు పవన్ చెప్పినప్పుడే ప్రభుత్వం కళ్లు తెరిస్తే.. జగన్ చేత చెప్పించుకునే పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/