Begin typing your search above and press return to search.

కాపుల‌ను దువ్వుతున్న చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   10 Sep 2015 12:30 PM GMT
కాపుల‌ను దువ్వుతున్న చంద్ర‌బాబు
X
కోస్తాలో బ‌ల‌మైన కాపు సామాజిక‌వ‌ర్గాన్ని చంద్ర‌బాబు టీడీపీకి ప‌ర్మినెంట్ ఓటుబ్యాంకుగా మార్చే ప‌నిలో ప‌డ్డారు. ఎన్నిక‌ల ముందు ఆయ‌న కాపుల‌కు ఇచ్చిన హామీల‌న్నింటిని నెర‌వేరుస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఈ రోజు ఆయ‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ద్వారకాతిరుమ‌ల‌లో విర్డ్ ఆసుప‌త్రిని ప్రారంభించిన అనంత‌రం మాట్లాడుతూ నిరుపేద కాపుల‌ను బీసీల్లో చేర్చే హామీకి తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు చెప్పారు. కాపుల కోసం రూ.100 కోట్ల‌తో కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

చంద్ర‌బాబు కాపుల కోసం వేస్తున్న ఎత్తులు చూస్తుంటే భ‌విష్య‌త్తులో కాపుల‌ను టీడీపీకి కంచుకోట‌గా మార్చేలా ప్లాన్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. స‌మైక్య రాష్ర్టంలో రెడ్ల‌దే ఆధిప‌త్యం ఎక్కువ‌. కోస్తా వ‌ర‌కు ఎలా ఉన్నా, రాయ‌ల‌సీమ‌, తెలంగాణ‌లో వారి ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉండేద‌న్న విష‌యం ఒప్పుకుని తీరాల్సిందే. రాష్ర్ట విభ‌జ‌న ఎప్పుడైతే జ‌రిగిందో రాజ‌కీయ పార్టీల‌న్ని ఏపీలో అగ్ర వ‌ర్ణాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపులందరికి స‌మాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. కోస్తాలో బ‌లంగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గం గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి కొమ్ము కాసింది. అదే సామాజిక‌ వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ కూడా టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఆ పార్టీకి ఫ్ల‌స్ అయ్యింది.

ఎన్నిక‌ల ముందు కూడా చంద్ర‌బాబు కాపుల‌ను బీసీల్లో చేరుస్తాన‌ని...కాపుల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. చంద్ర‌బాబు మాట ఇచ్చిన‌ట్టుగానే అధికారంలోకి రాగానే అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌కు హోం శాఖ‌తో పాటు డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఇచ్చారు. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రో ముగ్గురుకు కూడా కీల‌క‌మైన మంత్రి ప‌దవులు కేటాయించారు. తాజాగా ఇప్పుడు సంద‌ర్భంలేకుండానే మ‌రోసారి కాపులను బీసీల్లో చేర్చే అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చి వారి అభిమానాన్ని చూర‌గొన్నారు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో బ‌లంగా ఉన్న ఈ సామాజిక‌వ‌ర్గాన్ని పూర్తిగా టీడీపీ వైపు మ‌ళ్లించేందుకే ఆయ‌న ఈ రోజు ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో హాట్ హాట్‌ గా డిస్క‌ర్ష‌న్ జ‌రుగుతోంది. భ‌విష్య‌త్తులో ఈ సామాజిక‌వ‌ర్గం నుంచి ఎవ‌రైనా చిరంజీవిలా మారో పొలిటిక‌ల్ పార్టీ పెట్టి ఎన్నిక‌ల బ‌రిలో దిగినా కాపులంతా టీడీపీని వీడ‌కుండా ఉండేందుకే చంద్ర‌బాబు వారిని బాగానే దువ్వుతున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.