Begin typing your search above and press return to search.

అడ‌క‌త్తెర‌లో పోక చెక్క‌లు ఎవ‌రు బాబూ..?

By:  Tupaki Desk   |   22 Dec 2016 12:30 AM GMT
అడ‌క‌త్తెర‌లో పోక చెక్క‌లు ఎవ‌రు బాబూ..?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు ఉంటుంది..? ఈ ప్ర‌శ్న‌కు సమాధానం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా చెప్ప‌లేరేమో! కొత్త‌గా మంత్రి ప‌ద‌వులంటూ ఇవ్వ‌డం మొద‌లుపెడితే అది ఫిరాయింపుదారుల‌తోనే ప్రారంభించాలి. ఎందుకంటే, వైకాపా ఎమ్మెల్యేల‌కు ఆ కుర్చీల‌నే ఎర‌జూపి జంపింగులు ఎంక‌రేజ్ చేశారు క‌దా! మొద‌ట్లో ద‌స‌రాకి విస్త‌ర‌ణ‌ అన్నారు.. దీపావ‌ళి దాట‌గానే ప‌ద‌వులు పంచేస్తామ‌న్నారు.. ఇప్పుడే సంక్రాంతి స‌మీపిస్తున్నా సంద‌డి క‌నిపించ‌డం లేదు! డిసెంబ‌ర్‌ లో మున్సిప‌ల్ ఎన్నిక‌లుంటాయని ... ఆ త‌రువాత విస్త‌ర‌ణ ఉంటుంద‌ని కూడా గ‌తంలో చెప్పారు. ఆ డిసెంబ‌ర్ గ‌డువు కూడా దాటిపోతోంది. ఎన్నిక‌లూ లేవు - విస్త‌ర‌ణ ఊసూ లేదు. ఈ క్ర‌మంలో మ‌రో ఏడాది గ‌డిచిపోయింది. అన్నిటికీ మించి విలువైన తెలుగుదేశం పార్టీ పాల‌నా కాలం కూడా క‌రిగిపోతోంది. ఈ సంద‌ర్భంలో తెలుగుదేశం నేత‌ల్లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం! క్యాబినెట్ విస్త‌ర‌ణ వాయిదా ప‌డటంతో నిజంగా న‌ష్ట‌పోతున్న‌ది ఎవ‌రూ అనేది ఈ చ‌ర్చలోని సారాంశం.

విస్త‌ర‌ణ‌ అంటూ జ‌రిగితే వైకాపా నుంచి ఫిరాయించిన కొంత‌మందికి ప‌ద‌వులు త‌థ్యమ‌ని బాగా ప్ర‌చారం జ‌రిగింది. వారితోపాటు చాన్నాళ్ల నుంచి ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్న కొంద‌రు దేశం నేత‌ల‌కు కూడా బెర్తులు దొరుకుతాయ‌ని అనుకున్నారు. వారూ వీరూ అదే ఆశ‌తో ఉన్నా... విస్త‌ర‌ణ‌ను చంద్ర‌బాబు వాయిదా వేస్తున్నారు. దీనికి కార‌ణం... సో సింపుల్‌. ఫిరాయింపుదారుల‌కు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉంది. జంప్ జిలానీల అన‌ర్హ‌త విష‌య‌మై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఏదో ఒక‌టి తేల్చాల్సి ఉంది. నిజానికి - ఈ కేసు తెలంగాణ స‌ర్కారుకు సంబంధించిందే అయినా... ఆ తీర్పు ఏపీకి కూడా వ‌ర్తిస్తుంది క‌దా. సో.. ఈ నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ పేరుతో జంప్ జిలానీల‌కు ప‌ద‌వులు ఇస్తే - పోయేది చంద్ర‌బాబు ప‌రువే. ఆ విష‌యం ఆయ‌నకు తెలుసు కాబ‌ట్టి విస్త‌ర‌ణ వాయిదా వేస్తున్నార‌ని చెప్పాలి. అయితే, ఈ క్ర‌మంలో కొంతమంది తెలుగుదేశం నాయ‌కుల అసంతృప్తి వేరేలా ఉంటోంద‌ట‌!

జంప్ జిలానీల పుణ్య‌మా అని త‌మ‌కు రావాల్సిన ప‌దవుల విష‌యంలో ఆల‌స్యం అయిపోతోంద‌ని వారు గుర్రుగా ఉన్న‌ట్టు స‌మాచారం! ఫిరాయింపుదారుల వ‌ల్ల‌నే విస్త‌ర‌ణ వాయిదా ప‌డుతోంద‌నీ, లేదంటే ఇప్ప‌టికే తాము మంత్రులం అయి ఉండేవార‌మ‌ని ఓ ఇద్ద‌రు ముగ్గురు ఆఫ్ ద రికార్డ్ గోడు వెళ్ల‌గక్కుతున్నార‌ట‌. సీఎం చంద్ర‌బాబు కూడా వైకాపా నుంచి వ‌చ్చిన వారి గురించి ఆలోచిస్తూ త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఫిరాయింపు వ‌ల్ల త‌మ పొలిటిక‌ల్ కెరీర్ వ్య‌ర్థ‌మౌతోంద‌న్న భావ‌న వారిలో వ్య‌క్త‌మౌతోంది.

అయితే, విస్త‌ర‌ణ వాయిదా ప‌ర్వం నేప‌థ్యంలో అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా నలిగిపోతున్న‌ది ఎవ‌రు..? ప‌ద‌వులు ఆశించి తెలుగుదేశంలోకి వ‌చ్చిన వైకాపా ఎమ్మెల్యేలా..? ప‌ద‌వులు పొందే అర్హ‌త ఉండి కూడా నోరు మెద‌ప‌లేని స్థితిలో ఉన్న దేశం నాయ‌కులా..? ఎడాపెడా ఫిరాయింపులు ప్రోత్స‌హించేసి... అటు స్వ‌పక్ష నేత‌ల ఒత్తిడీ - ఇటు విప‌క్షం నుంచి కొత్తగా స్వ‌పక్షంలోకి వ‌చ్చిన నాయ‌కుల ఒత్తిడీ మ‌ధ్య న‌లుగుతున్నది చంద్ర‌బాబు నాయుడా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/