Begin typing your search above and press return to search.

సీనియర్లు కావాలంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   20 Feb 2017 6:21 AM GMT
సీనియర్లు కావాలంటున్న చంద్రబాబు
X
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారో తెలియదు కానీ మంత్రివర్గ విస్తరణ అన్న మాట నిత్యం ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంది. కొందరైతే దీనికి ఇప్పటికే ఎన్నో ముహూర్తాలు కూడా పెట్టేశారు.. అవేమీ నిజం కాకపోయినా కూడా ఇంకా ముహూర్తాలు పెడుతూనే ఉన్నారు. మరోవైపు లోకేశ్ తో పాటు కనీసం ఏడుగురికి కొత్తగా అవకాశ ముంటుందని, ప్రస్తుతమున్న మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన తప్పదని పరిశీలకులు లెక్కలేస్తున్నారు. జూనియర్ల ప్లేసులో సీనియర్లు వస్తారని చెబుతున్నారు. వైకాపానుంచొచ్చిన ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరికైనా మంత్రిపదవి కట్టబెడతారన్న అంచనాలు కూడా ఉన్నాయి.

లోకేష్‌ ను మంత్రివర్గంలోకి తీసుకుంటామంటూ పార్టీ వర్గాలకు చంద్రబాబు ఇప్పటికే సంకేతాలిచ్చేశారు. దీంతో కొందరికి ఉద్వాసన తప్పదన్న సూచనలు వెలువడుతున్నాయి. చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో వెల్లడైన అంశాల ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆ సర్వేల ప్రకారం.. కొందరు మంత్రులు తమ పదవులు శాశ్వతమన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న వైనం బట్టబయలైంది. వీరెవరూ మంత్రి హోదాకు తప్ప పార్టీ విస్తృతికి ఏమాత్రం సమయం కేటాయించడం లేదన్నది బాబు అభిప్రాయం. ఇప్పటికే ఇద్దరుముగ్గురు మంత్రులపై అవినీతి ఆరోపణలొచ్చాయి. కానీ అప్పటికప్పుడు వార్ని తొలగిస్తే ఆ అవినీతిని ప్రభుత్వానికంటగట్టి ప్రతిపక్షం ఇరుకునపెట్టే అవకాశాలున్నాయి. దీంతో అవినీతి ఆరోపణలొచ్చిన మంత్రుల్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. కానీ వీరితో ఎన్నికల కెళ్తే ఆ ప్రభావం పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తుందన్న భయం ఆయన్లో నెలకొంది. అలాగే మరికొందరు నిర్వహణా సామర్ధ్యాన్ని ప్రదర్శించలేక పోతున్నారు. ఇలాంటి ముగ్గురు మంత్రులను కూడా తప్పించాలన్న యోచన చంద్రబాబులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే పార్టీనేమాత్రం పట్టించుకోకపోవడం, కొన్ని జిల్లాల్లో సీనియర్లపై జూనియర్లు ఆధిపత్యపోరాటానికి దిగడం, మరి కొన్ని జిల్లాల్లో మంత్రి హోదాను అడ్డుపెట్టుకుని నియోజకవర్గాల్లో పోటీలేకుండా చూసుకోవడంలో భాగంగా మరో నాయకులెవర్నీ ఎదగనివ్వకపోవడం తదితర చర్యలకు పాల్పడుతున్న మంత్రుల చిట్టాను చంద్రబాబు రూపొందించారట.

వీలైనంత త్వరలో ప్రస్తుత టీమ్‌ ను పునవ్యవస్థీకరించే పనిలో చంద్రబాబున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సమావేశాల్లోగానే ఇందుకు ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశాలున్నట్లు అంచనాలేస్తున్నారు. మరోవైపు కొందరు జూనియర్ మంత్రులు సరిగా పనిచేయలేకపోతుండడంతో వారి స్థానంలో మళ్లీ సీనియర్లకు చాన్సివ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/