Begin typing your search above and press return to search.

కులాల గుట్టు బాబు గుప్పిట్లో ఉంద‌ట‌

By:  Tupaki Desk   |   26 Nov 2016 4:41 PM GMT
కులాల గుట్టు బాబు గుప్పిట్లో ఉంద‌ట‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో మారు కులాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విద్యా, ఉపాధి రంగాల్లో కాపులు వెనుకబడి ఉన్నందునే రిజర్వేషన్లు కల్పించదలిచామనీ, దీనివల్ల బీసీల రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు వాటిల్లబోద‌ని చంద్ర‌బాబు తెలిపారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల వర్తింపచేయ‌డంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నోమార్లు తమ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇవ్వడమేగాని అమలుకు అయితే టీడీపీ దీనికి కట్టుబడి ఉందని చంద్రబాబు చెప్పారు. వెనుకబడిన తరగతులకు చెందిన కల్లు గీత, కృష్ణ బలిజ, పూసల, మేదర సహకార ఆర్థిక సంస్థలకు నియమితులైన చైర్మన్‌లు, డైరెక్టర్ల పదవీ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న సంద‌ర్భంగా మాట్లాడిన సీఎం చంద్ర‌బాబు కాపుల రిజ‌ర్వేష‌న్ పై స్పందిస్తూ సుదీర్ఘ‌ వివ‌ర‌ణ ఇచ్చారు.

పదేళ్లుగా బీసీ వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్‌ల పదవులు భర్తీ కాలేదని, తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణంలోనే ఈ వర్గాలకు న్యాయం చేయడానికి ఇప్పటికి తొమ్మిది కార్పొరేషన్లలో చైర్మన్‌లు, డైరెక్టర్లను నియమించాన‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. తొలిసారిగా బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి దాని ద్వారా రూ.8,832 కోట్లు కేటాయించామ‌ని వివ‌రించారు. ఈ నియామ‌కంతో వివిధ పథకాల అమలుకు వీలవుతుందని, పైగా నిధులు దారి మళ్లే అవకాశం ఉండదన్నారు.కాపులకు రాజకీయ రిజర్వేషన్ల అవసరం లేదని ఇప్పటికే రాజకీయంగా వారు చాలా చైతన్యవంతంగా ఉన్నారని చంద్ర‌బాబు విశ్లేషించారు. జనాభాకు అనుగుణంగా చట్టసభలో, స్థానిక సంస్థలలో కాపులు పోటీ చేసి సీట్లు సాధించారని చంద్ర‌బాబు తెలిపారు. కాపులతో పాటు ఇతర అగ్రకులాలోని పేదల జీవన ప్రమాణాల పెంపుకు తాను కృతనిశ్చయంతో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. అయితే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసమే జస్టిస్‌ మంజునాథ‌ కమిషన్‌ను నియమించామని నివేదికకు అనుగుణంగా కాపులలోని పేదలకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తామని చంద్ర‌బాబు తెలిపారు. కాగా వ్య‌క్తుల వారీగా చేపట్టిన సర్వే తుది దశకు చేరుకుందని చంద్ర‌బాబు తెలిపారు. ఈ సర్వేతో కుల సంఘాల నేతల ప్రకటనలన్నీ లెక్కిస్తే యధార్ధ జనాభాకు ఐదు రెట్ల సంఖ్య తేలుతోందని పేర్కొన్నారు. త‌ద్వారా అర్హులైన కులాల‌కు న్యాయం చేసేందుకు అవ‌కాశం దొరుకుతుంద‌ని విశ్లేషించారు.