Begin typing your search above and press return to search.

సీఐఐ : నిరుటి వైభవం హంగామా అన్నీ తేడానే!

By:  Tupaki Desk   |   25 Feb 2018 10:57 AM GMT
సీఐఐ : నిరుటి వైభవం హంగామా అన్నీ తేడానే!
X
చంద్రబాబునాయుడు మాత్రం.. నానాటికీ ఏపీలోకి పెట్టుబడులు వెల్లువలాగా వచ్చేస్తున్నాయని అంటూ ఉంటారు. కానీ... విశాఖలో ప్రస్తుతం జరుగుతున్న సీఐఐ సదస్సుకు పారిశ్రామికవేత్తల స్పందన మాత్రం.. చాలా పలచగా ఉందని గత రెండు సందర్భాల్లో కూడా దీనిని పరిశీలించిన వారు చెబుతున్నారు. గత రెండు సందర్భాల్లోనూ సీఐఐ సదస్సుకు పారిశ్రామికవేత్తల స్పందన చెప్పుకోదగిన స్థాయిలోనే వచ్చిందని.. ఈసారి హాళ్లు కూడా నిండే పరిస్థితి లేదని అక్కడి వారి ద్వారా తెలుస్తోంది.

నిరుడు సదస్సు జరిగిన సమయంలో.. సీఐఐ ప్రాంగణం మాత్రమే కాదు.. ఆ రోడ్డు మొత్తాన్నీ పౌరవినియోగం లేకుండా.. బ్లాక్ చేసేసేవారు. ఒకవేళ అనివార్యంగా ప్రజలు వెళ్లాల్సి వస్తే గనుక.. పోలీసు తనిఖీలు చాలా ముమ్మరంగా ఉండేవి. అదే సదస్సు ప్రాంగణంలోకి అయితే సామాన్యులకు స్థానికులకు ప్రవేశం అనేది దుర్లభం. చీమను కూడా చొరనివ్వని రేంజిలో భద్రత ఏర్పాట్లు ఉండేవి.

అయితే ఈ సంవత్సరం ఆ వైభవం ఎక్కడా కనిపించలేదు. తొలిరోజు సదస్సుకు కనీస స్థాయిలో కూడా అతిథులు రాలేదు. హాళ్లు కూడా నిండకపోవడంతో.. ఒక దశ దాటిన తర్వాత.. రోడ్డమ్మట వెళ్లేవాళ్లను కూడా లోనికి అనుమతించేశారు. కనీసం హాలు నిండుగా కనిపిస్తే చాలు పరువు పోకుండా ఉంటుంది అనే ధోరణి నిర్వాహకుల్లో కనిపించింది.

అయితే తొలిరోజు సదస్సు ముగిసన తర్వాత.. పెట్టుబడులకు సంబంధించి.. ఒప్పందాలు భారీగానే కుదిరినట్లుగా చంద్రబాబునాయుడు ఒక ప ప్రకటన చేసేశారు. కానీ వాటిలో ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్ అవుతాయో ఎన్ని గాల్లో ఉండిపోతాయో.. ఎన్ని గాల్లోనే ఆవిరై పైకిపోతాయో ఎవ్వరికీ తెలియని సంగతి. గతంలో కుదిరిన ఒప్పందాల్లో దాదాపు 300 కంపెనీలు అసలు అడ్రస్ లేకుండాపోయాయి.

ప్రస్తుత సదస్సులో కూడా ఒప్పందాలు కుదురుతున్నాయి గానీ.. వాస్తవంలో గ్రౌండింగ్ అయితే తప్ప నమ్మలేం అని పలువురు అంటున్నారు. అసలే తొలిరోజునే ఎంపీ హరిబాబు మాట్లాడుతూ.. ఇలాంటి సమావేశాల్లో 15 శాతం ఒప్పందాలు కూడా పూర్తిస్థాయిలో రావడం కష్టం అని పెదవి విరవడం కూడా పలువురు గుర్తు చేస్తున్నారు.