Begin typing your search above and press return to search.

బాబుగారూ.. త‌మ్ముళ్లు కొట్టుకున్నారండీ!

By:  Tupaki Desk   |   8 Sep 2017 9:38 AM GMT
బాబుగారూ.. త‌మ్ముళ్లు కొట్టుకున్నారండీ!
X
వైసీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని, ఆ పార్టీ నేత‌లు హ‌ద్దులు దాటుతున్నార‌ని, వారి నాయ‌కుడు కూడా అంతేన‌ని, వారి మూలంగా శాంతి భ‌ద్ర‌త‌లకు స‌మ‌స్య‌లు వ‌స్తోంద‌ని ఇటీవ‌ల మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన టీడీపీ వ‌ర్క్ షాపులో గంట‌ల త‌ర‌బ‌డి విమ‌ర్శించిన టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు ఆ విమ‌ర్శ‌లు ఇప్పుడు బూమ‌రాంగ్ మాదిరిగా త‌గులుతున్నాయి. విజ‌య‌వాడ వైసీపీలో జ‌రిగిన అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాన్ని పెద్ద‌ది చేసి, పార్టీ మొత్తానికి ఆపాదించి బ‌ద్నాం చేయాల‌ని భావించిన సీఎంకి అప్ప‌ట్లోనే వంగ‌వీటి రాధా గ‌ట్టిగా బ‌దులిచ్చారు. దీంతో బాబు నోటికి తాళం ప‌డింది.

అయితే తాజాగా అనంత‌పురంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య జ‌రిగిన వీధి పోరాటం.. ఇప్పుడు ఏ పార్టీలో నేత‌లు బుద్ధి తెచ్చుకోవాలో? ఏ పార్టీ వాళ్లు క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతున్నారో? ఏ పార్టీ నేత‌ల వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయో స్ప‌ష్టం చేస్తోంది. శుక్ర‌వారం అనంత‌పురం న‌గ‌ర పాల‌క సంస్థ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. అయితే, ఇది ప్రారంభం నుంచి టీడీపీ త‌మ్ముళ్ల మ‌ధ్య భారీస్థాయి కుమ్ములాట‌ల‌తో వీధిపోరాటాన్ని త‌ల‌పించింది. టీడీపీ కార్పొరేటర్లు ఒకరి పై ఒకరు బాహాబాహీకి దిగారు. ఎంపీ జేసీ వర్గయుడిగా ముద్రపడ్డ టీడీపీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు పై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దాడి చేశారు.

తన డివిజన్ కు అన్యాయం జరిగిందని.. కులగజ్జితో వ్యవహరిస్తున్నారని సమావేశంలో ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన మరో టీడీపీ కార్పొరేటర్ నరేశ్ చౌదరి ఉమా పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్క‌సారిగా బాబు ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై విశ్లేష‌కులు దృష్టి పెట్టారు. అధికారంలో ఉండి, ప‌ద‌వులు అనుభ‌విస్తూ.. ప్ర‌జాధ‌నంతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ.. ప్ర‌జ‌ల కోసం చ‌ర్చించాల్సిన స్టాండింగ్ క‌మిటీ మీటింగ్ వంటి వేదిక‌ల‌ను అడ్డాగా చేసుకుని త‌మ్ముళ్లు రెచ్చిపోతే.. బాబుకు క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎదుటి వారి వైపు ఒక వేలు చూపించే బాబుకు.. త‌న మూడు వేళ్లు త‌న‌వైపే చూపిస్తున్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని అంటున్నారు. మ‌రి బాబు మార‌తాడో... లేదో చూడాలి.