Begin typing your search above and press return to search.

సర్వే డేంజర్ బెల్స్ విన్నావా బాబు?

By:  Tupaki Desk   |   15 April 2016 11:30 AM GMT
సర్వే డేంజర్ బెల్స్ విన్నావా బాబు?
X
ఏపీ సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలన మీద సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో బాబు పాలన బాగుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో బాబు అనుసరిస్తున్న కొన్ని విధానాలపై ప్రజలు తప్పు పట్టటం గమనార్హం. ఏపీలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయం లేదని తేలినా.. అది బాబు సమర్థత కంటే విపక్ష నేత జగన్ అసమర్థతే కారణంగా చెప్పాలి.

చంద్రబాబు పాలన మీద సంతృప్తి వ్యక్తం కావటం.. అన్ని జిల్లాల మధ్య సమతుల్య అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయం.. హామీల అమలు మీద ప్రజలు సానుకూలంగా ఓటేసినా.. మరికొన్ని అంశాల మీద మాత్రం బాబు సర్కారును తప్పు పట్టిన వైనాన్ని మర్చిపోకూడదు. గత రెండేళ్ల పాలనలో ప్రజాధనాన్ని ఖర్చు చేయటంలో బాబు వృధా చేస్తున్నట్లుగా విపక్షాలు చేస్తున్న విమర్శల్ని నమ్ముతారా? అంటే 56 శాతం మంది అవునని చెప్పటం గమనార్హం. అంతేకాదు.. బాబు సర్కారులో అవినీతి తగ్గిందా? అంటే లేదని చెప్పిన వారి సంఖ్య 43 శాతం మంది ఉంటే.. తగ్గిందని చెబుతున్న వారు 39 శాతం మాత్రమే.

నిజానికి ఈ రెండు విషయాలు ఇప్పుడేం కొత్తగా వచ్చినవి కావు. బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్నెల్ల తర్వాత నుంచి ఈ రెండు అంశాల మీద పలు విమర్శలు వస్తున్నాయి. అవినీతి విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ప్రజాధనాన్ని బాబు వృధా చేస్తున్నారన్న భావన కలుగజేయటంలో బాబే దోషి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్న విషయాన్ని బాబు పట్టకపోవటం.. దానికి ఆయన అంత ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఇప్పుడు ఈ తరహా భావన మరింత పెరిగేందుకు కారణమైందని చెప్పాలి. అవినీతి తగ్గించాలంటే అందరూ సహకరిస్తే కానీ సాధ్యం కానిది. కానీ.. వృధా ఖర్చు విషయంలో బాబు ఒక్కరు కఠినంగా ఉంటే సరిపోతుంది. లోపాన్ని సరి చేసుకునే అవకాశం ఉన్న అంశాల్ని వదిలిపెట్టటం సమర్థ పాలకుల లక్షణం కాదన్న విషయాన్ని బాబు మర్చిపోకూడదు.