Begin typing your search above and press return to search.

బాబూ..అంత‌ర్జాతీయ మీడియాకు ఏం చూపిస్తారండీ?

By:  Tupaki Desk   |   8 Jan 2018 9:46 AM GMT
బాబూ..అంత‌ర్జాతీయ మీడియాకు ఏం చూపిస్తారండీ?
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఈ నాలుగేళ్ల కాలంలో క‌ట్టింది రెండంటే రెండు భ‌వ‌న స‌ముదాయాలే. అవి కూడా తాత్కాలిక స‌చివాల‌యంతో పాటుగా తాత్కాలికంగానే నిర్మించిన అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయం. ఈ రెండు భ‌వ‌న స‌ముదాయాల‌ను నిర్మించేందుకే చంద్ర‌బాబు స‌ర్కారు నానా తంటాలు ప‌డింద‌న్న వాద‌న లేకపోలేదు. మూడేళ్ల సుదీర్ఘ కాలంలోనే రెండంటే రెండు బిల్డింగుల‌ను క‌ట్టేసిన చంద్ర‌బాబు సర్కారు... అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా... అమరావ‌తిని ప్ర‌పంచంలోనే మేటి న‌గ‌రంగా తీర్చిదిద్దుతామ‌ని గొప్ప‌లు పోతున్న వైనంపై ఇప్ప‌టికే విప‌క్షాలు ఓ ఆటాడుకుంటున్నాయి. అయితే విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను చాలా లైట్ తీసుకుంటున్న చంద్ర‌బాబు మాత్రం... అమ‌రావ‌తిలో ఏమేం చేస్తామో డిటిజ‌ల్ వేదిక‌గా చూపిస్తూ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది.

అంతేకాకుండా రాజ‌ధాని నిర్మాణం కోసం ఇప్ప‌టిదాకా కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన రూ.1,500 కోట్ల‌ను దేనికి ఖ‌ర్చు చేశామ‌న్న విష‌యాన్ని కూడా స్ప‌ష్టంగా చెప్ప‌లేని స్థితిలో బాబు స‌ర్కారు ఉంద‌ని, ఈ త‌ర‌హా వైఖ‌రి కార‌ణంగానే కేంద్రం నుంచి కూడా నిధుల విడుద‌ల‌లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంద‌ని విప‌క్ష వైసీపీతో పాటు కాంగ్రెస్‌ - క‌మ్యూనిస్టు నేత‌లంతా ముక్త కంఠంతో ఒకే రీతిలో దాడి చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్ట‌డంలో బాబు స‌ర్కారు చూపిస్తున్న చొర‌వ రాజ‌ధాని నిర్మాణంపై చూపించ‌డం లేద‌ని కూడా జ‌నం కూడా అనుకునే ప‌రిస్థితి దాదాపుగా వ‌చ్చేసింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అమ‌రావ‌తి న‌గ‌రం ఎంతో గొప్ప‌గా ఉంటుందంటూ జాతీయ మీడియాను ఇక్క‌డికి తీసుకొచ్చి మ‌రీ చూపించిన చంద్ర‌బాబు... ఇప్పుడు ఏకంగా అంత‌ర్జాతీయ మీడియా దృష్టికి కూడా అమ‌రావ‌తిని తీసుకెళుతున్నారు. ఇందులో భాగంగా రేపు దేశ రాజ‌ధాని ఢిల్లీలో అంత‌ర్జాతీయ మీడియా ప్ర‌తినిధుల‌తో ఓ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ స‌మావేశానికి బాబు నేరుగా వెళ్ల‌కున్నా... స‌మావేశంలో పాలుపంచుకునే సీఆర్డీఏ అధికారుల‌కు మాత్రం దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు అమ‌రావతిలో కనిపిస్తున్న ఖాళీ స్థ‌లంలో మున్ముందు ఏఏ భ‌వ‌నాల‌ను ఏ రీతిన క‌డ‌తామ వివ‌రించాల‌ని బాబు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశార‌ట‌. ప్ర‌ధానంగా అమ‌రావ‌తి న‌గ‌రంలో ఏర్పాటు కానున్న ప్ర‌ధాన విభాగాల్లో ఒక‌టైన మీడియా సిటీని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించాల‌ని, అందులో కొలువుదీరే సంస్థ‌లు ఇవేనంటూ ఓ లిస్టును కూడా ఆయ‌న అధికారుల‌కు అంద‌జేసిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. అస‌లే నిర్మాణాలు లేని అమ‌రావ‌తి ఎప్పుడు ఓ రూపు దాలుస్తుందో తెలియ‌ని నేప‌థ్యంలో... ఆ వైనాన్ని అంత‌ర్జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లి, తద్వారా పెట్టుబ‌డులు రాబ‌ట్టే విధంగా వ్వ‌వ‌హ‌రించాల‌న్న చంద్ర‌బాబు ఆశ‌యాన్ని అధికార గ‌ణం ఏ మేర‌కు స‌ఫ‌లీకృతం చేస్తుందో చూడాలి.