Begin typing your search above and press return to search.
మళ్లీ బాబు ముందస్తు ఎన్నికల జపం
By: Tupaki Desk | 4 Sep 2017 5:15 PM GMT2018 డిసెంబర్ నాటికి ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సంకేతాలను గతంలోనే పార్టీ శ్రేణులకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు అదే జోస్యం చెప్పారు. అది కూడా తన పార్టీ ముఖ్యనేతలతో కావడం గమనార్హం. నంద్యాల ఉప ఎన్నిక - కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై గుంటూరులోని హ్యాపీ రిసార్ట్ లో సోమవారం టీడీపీ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ నేతలకు ముందస్తు ఎన్నికలపై సంకేతాలిచ్చారు. 2018 డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు ధీమాగా తెలిపారు.
అడ్డగోలుగా తెలుగు ప్రజలను విభజించిన తర్వాత ఏపీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని... అలాంటి సందర్భంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తనకు ప్రజలు ఓ అవకాశాన్ని ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చేస్తాననే నమ్మకం ప్రజల్లో ఉందని - ఆ విశ్వాసంతోనే తమ పార్టీకి అపూర్వమైన విజయాలను అందిస్తున్నారని తెలిపారు. తమ పార్టీని గెలిపించిన కాకినాడ ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు మరోమారు స్పష్టంచేశారు. ప్రాంతాలు - కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయనీ - సంక్షోభాన్ని సృష్టించాలని చూసినా ప్రజలు నమ్మలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలే రాబోయే ఎన్నికల్లోనూ ప్రతిఫలించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇంకా విపక్షాల బెదిరింపులకు తాను భయపడే సమస్యే లేదని, అలా భయపడి ఉంటే పట్టిసీమ నిర్మాణం పూర్తయ్యి ఉండేది కాదని బాబు వివరించారు. తనకు ఉన్న అవకాశాలను వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
అయితే గెలిచిన ఎన్నికల సందర్భంగా సమీక్ష నిర్వహిస్తూ భవిష్యత్ లో జరగబోయే ఎన్నికల గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఇంత నమ్మకంగా జోస్యం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మదిలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న ఆలోచన విషయమై కేంద్రం నుంచి ఏపీ సీఎంకు సంకేతాలు ఏమైనా అందుతున్నాయా అనే చర్చ జరుగుతోంది.