Begin typing your search above and press return to search.

పాతదానికే దిక్కులేదు..కొత్త లెక్కలేంది బాబు?

By:  Tupaki Desk   |   16 Jan 2017 6:38 AM GMT
పాతదానికే దిక్కులేదు..కొత్త లెక్కలేంది బాబు?
X
నమ్మకం నడిపిస్తుందని చెబుతారు. తనను నమ్మి అధికారం అప్పగించిన ప్రజలు తనమీద విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకున్నారని పాలకులు భావిస్తుంటారు. అందుకే కాబోలు.. పవర్ లో ఉన్న తామేం చెప్పిన ప్రజలు నమ్మేస్తారని ఫీలవుతారో ఏమో కానీ.. చాలానే మాటలు చెబుతుంటారు. తాము చెప్పే మాటల్లో సత్యాల కంటే అసత్యాలే ఎక్కువగా ఉంటాయని తెలిసినా.. పాలకులు తమ మాటల ప్రవాహాన్ని ఆపరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తే ఇది నిజమనిపించక మానదు.

కొత్త సంవత్సరం.. మొదటి నెలలో నిర్వహించే భాగస్వామ్య సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చెప్పే మాటలు చాలా ముచ్చటగా ఉంటాయి. ఆ సదస్సులో ప్రభుత్వం కుదర్చుకున్న ఒప్పందాల గురించి చంద్రబాబు తరచూ బడాయి కబుర్లు చెబుతుంటారు. అయితే.. ఇందులో నిజం మాట ఎంతన్నది తరచి చూస్తే షాక్ తినాల్సిందే. తనను నమ్మిన ప్రజలకు బాబు చెప్పే మాటల్లో ఇంత మాయాజాలం ఉంటుందా? అన్న సందేహం కలగాల్సిందే.

ఎందుకంటే.. గత ఏడాది జనవరిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు గురించి బాబు చెప్పిన మాటలు అన్నిఇన్ని కావు. విశాఖలో నిర్వహించిన ఈ సదస్సు సూపర్ సక్సెస్ అయ్యిందని.. రూ.4.37లక్షల కోట్లకు వ్యాపార అవగాహన ఒప్పందాలు జరిగినట్లుగా ఆయన చెప్పారు. మరి.. ఏడాది వ్యవధిలో ఈ ఒప్పందాల్లో ఎన్ని కార్యాచరణలోకి వచ్చాయన్న విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించినప్పుడు షాక్ తినే వాస్తవాలు బయటకు వచ్చాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రూ.4.37లక్షల కోట్లలో కనీసం కోటి రూపాయిల ఒప్పందం కూడా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చిన ఈ పచ్చినిజాన్ని పట్టించుకోకుండా.. ఈ నెల 27 నుంచి విశాఖవేదికగా నిర్వహించే భాగస్వామ్య సదస్సును భారీగా నిర్వహిస్తున్నట్లుగా ఏపీ సర్కారు ప్రకటించింది.

గత ఏడాది సాధించిన దాని కంటే భారీగా ఒప్పందాలు చేసుకోనున్నట్లు ఏపీ సర్కారు చెబుతోంది. గత ఏడాది రూ.4లక్షల కోట్లకు రెట్టింపు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించింది. గత ఏడాది కుదుర్చుకున్న రూ.4లక్షలకు ఇప్పటికి దిక్కు దివానం లేకుండా పడి ఉంటే.. వాటి గురించి వదిలేసి కొత్త ఒప్పందాల మీద దృష్టి పెట్టనున్నట్లుగా చెబుతున్న బాబు సర్కారు మాటలు వింటే.. బడాయి కబుర్లు తప్పించి.. పని జరిగేది ఉండదా? అన్న భావన కలగటం ఖాయం. జనాల నమ్మకాల్ని పూర్తిస్థాయిలో దెబ్బేసేలా బాబు మాటలెలా చెబుతున్నారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/