Begin typing your search above and press return to search.

బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు బాల‌రిష్టాలు

By:  Tupaki Desk   |   1 Jan 2017 9:31 AM GMT
బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు బాల‌రిష్టాలు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ సేవలపై ఆదిలోనే అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఎంతో ఆర్భాటంగా చంద్రబాబునాయుడు ప్రారంభించిన ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదని అంటున్నారు. ప్రభుత్వ ఆర్భాటమే తప్ప ప్రయోజనం కనిపించలేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు గ్రామంలో ముఖ్యమంత్రి ఉన్నంత వరకే పని చేశాయని - శుక్రవారం నుంచి సేవలు అందడంలేదని గ్రామస్తులు అంటున్నారు. మోరి - మోరిపాడు గ్రామాల్లో 1,403 కుటుంబాలకు ఫైబర్‌ సెట్‌ టాప్‌ బాక్సులు ఇచ్చారు. వీటిలో 20 శాతం కూడా పనిచేయడం లేదు. రూ.144కే టీవీ - ఇంటర్నెట్‌ సేవలందిస్తామని చంద్రబాబు చెప్పిన 24 గంటల్లోపే ఈ సేవలు ప్రజలకు అందడం లేద‌నే ఫీడ్ బ్యాక్ రావ‌డం ఆస‌క్తిక‌రం.

మోరి - మోరిపాడు గ్రామాల్లో 2,201 కుటుంబాలు - 7,357 మంది జనాభా ఉంది. మొత్తం నగదు రహిత లావాదేవీలు జరిగే గ్రామాలుగా ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ విధంగా కనిపించడం లేదు. 10 శాతం మంది జనాభాకు కూడా నగదు రహిత సేవలు అందడం లేదు. 7,357 జనాభాలో 200 నుంచి 300 మంది వరకే పేటిఎం - స్వైప్‌ మిషన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు చేస్తున్నారు. మిగిలిన జనాభా మొత్తం నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మోరి - మోరిపాడు గ్రామాల్లో 4,500 మందికి మాత్రమే వివిధ బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి. 2,857 మందికి ఖాతాలు లేవు. ఖాతాల్లో డబ్బులుంటేనే నగదు రహిత లావాదేవీలు జరుగుతాయి. గ్రామప్రజల్లో వీటిపై అవగాహనలేక నగదు లావాదేవీలే మేలు అంటున్నారు. మోరి గ్రామాన్ని దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ సిటీగా నామకరణం చేసిన సిఎం చంద్రబాబు.. క్షేత్ర స్థాయిలో ఆ విధంగా లేదన్న విషయాలను తెలుసుకోలేకపోయారని ఆ గ్రామాల ప్రజలంటున్నారు. గ్రామీణ ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రజలలో వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన లేదు.

'ఇక్కడ నగదు రహిత లావాదేవీలు జరుగును' అని గ్రామాల్లోని అన్ని వాణిజ్య - వ్యాపారాల దుకాణాల్లో బోర్డులు పెట్టారు. తీరా షాపుల్లో ఎలాంటి నగదు రహిత లావాదేవీలూ జరగడం లేదు. మోరిలోని మూడు చోట్ల మాత్ర‌మే మూడు చోట్ల మాత్ర‌మే ఇలాంటి లావాదేవీలు సాగుతున్నాయి. ఓ మెడికల్‌ షాపు - ఎరువుల షాపు - బ్రాందీ షాపులు మూడింట్లోనే ఏటీఎం - స్వైపింగ్‌ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. మిగిలిన వాటిలో నగదు పైనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనిపై షాపుల యాజమాన్యంతో మాట్లాడగా సీఎం వస్తున్నారని... వివిధ బ్యాంకుల అధికారులు, ఫైబర్‌ గ్రిడ్‌ సేవ ప్రతినిధులు తమ షాపుల ముందు బోర్టులు పెట్టారన్నారు. ఇదిలాఉండ‌గా...సీఎం చంద్ర‌బాబు పర్యటన సాకుతో కోట్లాది రూపాయలు రోడ్ల పాలయ్యాయి. మోరి - మోరిపాడు గ్రామాల్లో రూ.1.80 లక్షలతో గ్రావెల్‌ - సిసి - బిటి రోడ్లను నిర్మించారు. ముఖ్యమంత్రి పర్యటనా సమయం ముంచుకొస్తోందని గుత్తదారులు నాణ్యత లేకుండా రహదారులు నిర్మాణం చేపట్టారు. నల్లకంకరలో బూడిద కలిపి పలుచగా రోడ్లు నిర్మించారు. వేసిన నాలుగు రోజులకే పలుచోట్ల గతుకులుగా కనిపిస్తున్నాయి. మోరిపాడు నుంచి మోరి వెళ్లే రహదారి మొత్తం పూతరేకుల్లా పలుచగా వేయడంతో రోడ్లు లేస్తున్నాయి. ఇలాంటి రోడ్లు ఉన్నా, లేకపోయినా ఒక్కటే అని గ్రామస్తులు అంటున్నారు. మోరీ, మోరిపాడు గ్రామాల్లో వంద శాతం స్వచ్ఛత సాధించామని చెపుతున్నా.. బహిరంగ మలవిసర్జన కొనసాగుతూనే ఉంది. డంపింగ్‌ యార్డు లేక రోడ్ల పక్కనే చెత్త దర్శనమిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/