Begin typing your search above and press return to search.

ఐదు గ్రామాల మీద బాబు మాట విన్నారా?

By:  Tupaki Desk   |   19 April 2016 4:23 AM GMT
ఐదు గ్రామాల మీద బాబు మాట విన్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నిజం కానున్నాయా? పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి దఖలుపడ్డ గ్రామాల్లో 5 గ్రామాల్ని తెలంగాణకు తిరిగి ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే అన్నారంటూ తెలంగాణ సీఎం ఇటీవల వ్యాఖ్యానించటం తెలిసిందే. ఇదే అంశం మీద ఇప్పటికే మూడు.. నాలుగుసార్లు కేసీఆర్ మాట్లాడినా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం స్పందించకపోవటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏపీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ఖండించారు. ఏపీలో కలిసిన గ్రామాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు తిరిగి ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. ఉమ ఇంత బలంగా చెప్పిన తర్వాత ఐదు గ్రామాల విషయంలో కేసీఆర్ ఎందుకలా చెప్పినట్లు? అన్న సందేహాలు కలిగాయి. అయితే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. దేవినేని వ్యాఖ్యలు తప్పని.. కేసీఆర్ మాటలే నిజమయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.

సోమవారం మంత్రివర్గ సమావేశం పూర్తి అయ్యాక ఏపీ సీం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన్ను ఐదు గ్రామాల విషయమై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు సూటిగా సమాధానం ఇవ్వకుండా.. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంటి సమస్యలున్నా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుంటాం’’ అని చెప్పారు. నిజానికి ఐదు గ్రామాలకు సంబంధించి ఇరురాష్ట్రాల మధ్య వివాదం ఏమీ లేదు. కానీ.. కూర్చుని మాట్లాడతామని చెప్పటం ద్వారా.. తెలంగాణకు ఐదు గ్రామాల్ని ఇస్తామన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ.. కేసీఆర్ మాటను ఖండిచాలనుకుంటే.. ఐదు గ్రామాల్ని ఇచ్చే ప్రసక్తే లేదని దేవినేని ఉమ మాదిరి చెప్పేసే వారు కదా..?