Begin typing your search above and press return to search.

పుష్కర ఘాట్ల బొమ్మలకూ ఫారిన్ డిజైనర్లా బాబూ

By:  Tupaki Desk   |   23 Jun 2016 7:44 AM GMT
పుష్కర ఘాట్ల బొమ్మలకూ ఫారిన్ డిజైనర్లా బాబూ
X
ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపితే చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కృష్ణానదిలో కలిపేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. కారు షెడ్డు వేయాలన్నా కూడా సింగపూర్ - జపాన్ కంపెనీలతో డిజైన్లు గీయించే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శలొస్తున్నాయి. త్రీడీ చిత్రాలతో ప్రజలను మాయచేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అమరావతి డిజైన్లంటూ ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు రకరకాల నమూనాలు రిలీజ్ చేసినా వాటికి ఇంతవరకు పునాది రాళ్లు మాత్రం పడలేదు. దీంతో చంద్రబాబు త్రీడీ బొమ్మలను జనం నమ్మడం మానేశారు. అయినా కూడా ఆయన తాజాగా కృష్ణా పుష్కరాలకు కూడా ఘాట్ల డిజైన్లంటూ విదేశీ సంస్థలతో గీయించారు. చైనాకు చెందిన గిజ్ హౌ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ప్లాన్లు ఇచ్చింది. దీంతో చంద్రబాబు ఇంత చిన్న విషయానికి కూడా తెలుగువారిని ఉపయోగించడం లేదన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

అమరావతి నిర్మాణం సుదీర్ఘ ప్రణాళిక కావడం.. భారీ ప్రాజెక్టు కావడం.. అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణం కావడంతో ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న విదేశీ సంస్థలకు ప్రాధాన్యమివ్వడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. 12 రోజుల పాటు నిర్వహించే పుష్కారాల కోసం ఘాట్ల నమూనాలను కూడా విదేశీ సంస్థలతోనే బొమ్మలేయంచడం మాత్రం ఏమాత్రం హర్షించదగిన పరిణామం కాదు. మాట్లాడితే తెలుగువారు, తెలుగు జాతి అంటూ చెప్పే చంద్రబాబు చేతల్లో మాత్రం ఇలా వ్యవహరించడంపై విమర్శలు కురుస్తున్నాయి.

బొమ్మలు గీసి హడావుడి చేయడం కంటే ఏర్పాట్లు సక్రమంగా చేయడంపై దృష్టి పెట్టాలని ప్రజలు కూడా సూచిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు కూడా నానా హడావుడి చేసి చివరకు ప్రజల ప్రాణాలు పోయేలా చేశారని అంటున్నారు. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా పక్కా ఏర్పాట్లు చేయడంపై దృష్టిపెట్టాలే కానీ అందం, ఆర్భాటం ముఖ్యం కాదని.. భద్రత - సౌకర్యాలే ప్రధానమని సూచిస్తున్నారు. మరి చంద్రబాబు చెవికెక్కించుకుంటారో లేదంటే ‘అంతా నా ఇష్టం’ అంటారో చూడాలి.