Begin typing your search above and press return to search.

చంద్రబాబుది ముందుచూపా...? మొండిచేయా?

By:  Tupaki Desk   |   30 Jan 2016 10:09 AM GMT
చంద్రబాబుది ముందుచూపా...? మొండిచేయా?
X
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముందూవెనుకా చూడకుండా దూసుకెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ను తాను ఎలా అభివృద్ధి చేశానన్నది గుక్క తిప్పుకోకుండా చెప్పుకుంటున్నారు. అయితే... ఆ ప్రయత్నంలో ఆయన ఆంధ్రలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ లో తన ప్రచారం ముగించిన తరువాత ఆయన శనివారం ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ తాను ఎంతో ముందుచూపుతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్పడంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. ముందుచూపుతో చేసిన ఆ అభివృద్ధి ఇప్పుడు తెలంగాణకు పనికొచ్చి ఏపీ తీవ్రంగా నష్టపోతోందని అంటున్నారు. మొత్తం అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతం చేసి ఏపీకి మొండిచేయి చూపడం ముందుచూపు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఐటీ రంగ అభివృద్ధి తో పాటు ఎన్నో ప్రాజెక్టులకు హైదరాబాద్ కే పరిమితం చేయడం... విశాఖ - విజయవాడ - నెల్లూరు - తిరుపతి - గుంటూరు వంటి నగరాలు ఏపీలో ఉన్నా వాటిని విస్మరించి మొత్తం హైదరాబాద్ కే పెట్టడంతో ఇప్పుడు కష్టమొచ్చిందని అంటున్నారు. హైదరాబాద్ నుంచి భారీగా ఆదాయం జనరేట్ అవుతూ తెలంగాణ ప్రభుత్వం లాభపడుతోందని... అదేసమయంలో ఏపీ జేబులో రూపాయి లేక దిక్కులు చూస్తోందని అంటున్నారు. చంద్రబాబు ముందుచూపు తెలంగాణ ప్రజలకు పనికొచ్చి ఏపీ ప్రజలకు కష్టాలు మిగిల్చిందని ఆరోపిస్తున్నారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కూడా కాస్త కలవరపాటుకు గురవుతున్నాయి.