Begin typing your search above and press return to search.

పాత చంద్రబాబు మళ్లీ వస్తారా?

By:  Tupaki Desk   |   28 Aug 2015 11:03 AM GMT
పాత చంద్రబాబు మళ్లీ వస్తారా?
X
అతి సర్వత్ర వర్జయేత్ అని అంటారు పెద్దలు. అంటే ఏ పనిలోనూ అతి చేయవద్దని సూచిస్తారు. ఇది చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను ఆయన చీల్చి చెండాడారు. అప్పట్లో ఆయన ఉద్దేశం మంచిదే అయినా దానిని వివరించకుండా నియంతగా వ్యవహరించడం కొంప ముంచింది. అప్పట్లో ఏ క్షణంలోనూ చంద్రబాబు ఉద్దేశం ఏమిటనేది ఎవరికీ అర్థం కాలేదు. చివరికి ఆ పార్టీ మంత్రులు, నాయకులు కార్యకర్తలకు కూడా. దాంతో ఉద్యోగులకు ఆయన చండశాసనుడిలా కనిపించారు. అప్పట్లో ఆయన అతిగా ప్రవర్తించారనే విమర్శలూ వచ్చాయి. అది నిజం కూడా.

రెండోసారి ఇప్పుడు నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులను నెత్తిన పెట్టుకుంటున్నారు. వాళ్లను ఒక్క మాట కూడా అనడం లేదు. 43 శాతం జీతాలు పెంచినా.. వాళ్లు అవినీతికి పాల్పడుతున్నా.. అవినీతికి చెక్ చెప్పడంలో విఫలమైనా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఇప్పటికీ చూసీ చూడనట్లే వెళ్లిపోతున్నారు ఉదాసీనతలో కూడా ఆయన అతిగానే వ్యవహరిస్తున్నారు.

అయితే, కొద్ది కాలంగా ఉద్యోగుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చంద్రబాబు మూడు నెలల్లో మళ్లీ పాత బాబును చూస్తారని విజయవాడలో వ్యాఖ్యానించారు. దాంతో ఉద్యోగుల్లో మళ్లీ కలకలం మొదలైంది. అయితే, ఇప్పుడు కావాల్సింది పాత చంద్రబాబు కాదు. కొత్త చంద్రబాబు, పాత చంద్రబాబు కలగలిసి పరిణతితో కూడిన చంద్రబాబు ఇప్పటి అవసరం. అంటే అటు నియంతృత్వమూ ఉండకూడదు. ఇటు అలవిమాలిన ఉదాసీనతా ఉండకూడదు. తప్పుచేస్తే వెంటనే శిక్షించాలి. ఎవరినీ ఉపేక్షించకూడదు. అదే సమయంలో పని చేసిన వారిని ప్రోత్సహించాలి. ఎవరు అడ్డు పుల్ల వేసినా వెనక్కి తగ్గకూడదు. ఉద్యోగులకు ప్రయారిటీ ఇవ్వాలి. కానీ వాళ్లే ఏం చేసినా చూస్తూ ఉండడమనే ప్రసక్తి ఉండకూడదు. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి కానీ ఉద్యోగులకు తలొగ్గినట్లు ఉండకూడదు. చంద్రబాబు మాట ఉద్యోగులు వినాలి తప్పితే, ఉద్యోగుల మాటలు చంద్రబాబు వినేలా ఉండకూడదు. లేకపోతే పరస్పర అవగాహనతో ముందుకెళ్లాలి. ఇటువంటి వైఖరిని అవలంబించకపోతే చంద్రబాబుకే మళ్లీ నష్టం.